యోహాను 18:1-27
యోహాను 18:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి–మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు–నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు–ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. మరల ఆయన–మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు–నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో–నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను. –నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను. ఆ దాసునిపేరు మల్కు. యేసు–కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ. కయప–ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతోకూడ వెళ్లెను. పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను. ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు–కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను. ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధనుగూర్చియు యేసును అడుగగా యేసు–నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు – ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు–నేను కాని మాట ఆడినయెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను. అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి–నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు–నేను కాను, నేనెరుగననెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును–నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
యోహాను 18:1-27 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు ప్రార్థించిన తర్వాత, తన శిష్యులతో కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోనికి ఆయన తన శిష్యులతో కలిసి వెళ్లారు. యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కనుక ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు. కనుక యూదా తనతో సైనికుల గుంపును మరియు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో మరియు ఆయుధాలతో తోటకు వచ్చాడు. యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. “నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు. “ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు. యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు. ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. అందుకు “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు. అందుకు యేసు, “నేనే ఆయనను అని మీతో చెప్పాను, ఒకవేళ మీరు నా కొరకే వెదకుతున్నట్లయితే, వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు. “నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు” అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది. అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు. అప్పుడు యేసు పేతురును “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు. అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు. వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకొనివెళ్లారు. ప్రజలందరు నశించిపోకుండా వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే. సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కనుక, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు. కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుని పరిచయుడైన ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి, అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకు వచ్చాడు. ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కావు కదా?” అని పేతురును అడిగింది. అందుకు అతడు “నేను కాదు” అన్నాడు. అప్పుడు చలిగా ఉన్నందుకు సేవకులు మరియు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు. ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు. అందుకు యేసు “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను, ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరంలో లేదా దేవాలయంలోనే నేను బోధించాను, నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు. నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు. యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడివున్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంప మీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు. అందుకు యేసు “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు. అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు. సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు, వారు “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు. అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు. ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువు, “నేను నిన్ను ఒలీవల తోటలో ఆయనతో చూడలేదా?” అని అడిగాడు. పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.
యోహాను 18:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు. యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు. అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వారితో, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు “నజరేతు వాడైన యేసు” అని జవాబిచ్చారు. యేసు వారితో, “నేనే ఆయన్ని” అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు. ఆయన వారితో, “నేనే” అని చెప్పినప్పుడు వారు వెనక్కి తూలి నేల మీద పడ్డారు. ఆయన మళ్ళీ, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు మళ్ళీ, “నజరేతు వాడైన యేసు కోసం” అన్నారు. యేసు వారితో, “ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వారిని వెళ్ళిపోనివ్వండి” అన్నాడు. “నువ్వు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు” అనే ఆయన వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు. అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. ఆ సేవకుడి పేరు మల్కు. యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు. అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు. మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ. ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప. సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు. కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు. గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసి పేతురుతో, “నువ్వు ఆతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అంది. అతడు, “కాదు” అన్నాడు. చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలి కాచుకొంటున్నారు. పేతురు కూడా వారితో నిలుచుని చలి కాచుకొంటున్నాడు. ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు. యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు. నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు. యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు. తరువాత అన్న బంధితుడైన యేసును ప్రధాన యాజకుడు కయప దగ్గరికి పంపాడు. అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. అక్కడున్న వారు అతనితో, “నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. “కాదు” అన్నాడు. పేతురు ఎవరి చెవి నరికాడో వాడి బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, “నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది.
యోహాను 18:1-27 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు. యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు. అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు. యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి?” అని అడిగాడు. “నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు. యేసు, “నేనే ఆయన్ని” అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు. యేసు, “మీకెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు. వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు. యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు. “నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకోలేదు” అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది. సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు “మల్కు.” యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు. ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. “అన్న” “కయపకు” కూమార్తె నిచ్చిన మామ. “కయప” ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే! సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు. కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు. “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది. “లేదు!” అని అతడు జవాబు చెప్పాడు. చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు. ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు. యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు. యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు. యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు. ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు. సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు. “కాదు” అని పేతురు అన్నాడు. ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు. పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.