యోహాను 18:1-27

యోహాను 18:1-27 TCV

యేసు ప్రార్థించిన తర్వాత, తన శిష్యులతో కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోనికి ఆయన తన శిష్యులతో కలిసి వెళ్లారు. యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కనుక ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు. కనుక యూదా తనతో సైనికుల గుంపును మరియు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో మరియు ఆయుధాలతో తోటకు వచ్చాడు. యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. “నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు. “ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు. యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు. ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. అందుకు “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు. అందుకు యేసు, “నేనే ఆయనను అని మీతో చెప్పాను, ఒకవేళ మీరు నా కొరకే వెదకుతున్నట్లయితే, వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు. “నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు” అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది. అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు. అప్పుడు యేసు పేతురును “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు. అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు. వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకొనివెళ్లారు. ప్రజలందరు నశించిపోకుండా వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే. సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కనుక, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు. కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుని పరిచయుడైన ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి, అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకు వచ్చాడు. ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కావు కదా?” అని పేతురును అడిగింది. అందుకు అతడు “నేను కాదు” అన్నాడు. అప్పుడు చలిగా ఉన్నందుకు సేవకులు మరియు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు. ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు. అందుకు యేసు “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను, ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరంలో లేదా దేవాలయంలోనే నేను బోధించాను, నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు. నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు. యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడివున్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంప మీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు. అందుకు యేసు “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు. అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు. సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు, వారు “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు. అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు. ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువు, “నేను నిన్ను ఒలీవల తోటలో ఆయనతో చూడలేదా?” అని అడిగాడు. పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.