యోహాను 13:3-17

యోహాను 13:3-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

తండ్రి అన్నిటిని తన అధికారం క్రింద ఉంచాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడని యేసుకు తెలుసు. కనుక ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువ్వాలును నడుముకు కట్టుకున్నారు. ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్ళు పోసి, తన శిష్యుల కాళ్ళను కడిగి, తన చుట్టూ కట్టుకొని ఉన్న తువ్వాలుతో వాటిని తుడవడం మొదలుపెట్టారు. ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు, “ప్రభువా, నీవు నా కాళ్ళు కడుగుతావా?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను చేస్తున్న దానిని ఇప్పుడు మీరు గ్రహించలేరు, కాని తర్వాత గ్రహిస్తారు” అన్నారు. పేతురు, “లేదు ప్రభువా, నీవు ఎప్పుడు నా కాళ్ళను కడుగకూడదు” అన్నాడు. అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడుగకపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు. అప్పుడు సీమోను పేతురు, “అయితే ప్రభువా, నా కాళ్ళు మాత్రమే కాకుండా నా చేతులను మరియు తలను కూడా కడుగు!” అన్నాడు. అందుకు యేసు, “స్నానం చేసినవారి శరీరం మొత్తం శుభ్రంగా ఉంటుంది, కనుక వారు పాదాలను మాత్రం కడుగుకొంటే చాలు; మీరు శుద్ధులే, కాని అందరు కాదు” అని అన్నారు. ఆయనను ఎవరు అప్పగించబోతున్నారో ఆయనకు ముందే తెలుసు, అందుకే ఆయన “మీలో అందరు శుద్ధులు కారు” అన్నారు. ఆయన వారి కాళ్ళను కడిగి, ఆయన తన వస్త్రాన్ని వేసుకొని తన కూర్చున్న చోటికి తిరిగి వెళ్లి, “నేను మీకు చేసింది మీరు గ్రహిస్తున్నారా?” అని ఆయన వారిని అడిగి ఇలా చెప్పడం మొదలుపెట్టారు: “అవును, మీరు నన్ను ‘బోధకుడని, ప్రభువని’ పిలుస్తున్నారు. నేను అదే అయి ఉన్నాను కనుక ఇలా పిలవడం న్యాయమే. నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ కాళ్ళను కడిగాను, కనుక మీరు కూడ ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీ కొరకు చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను. ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకువెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కనుక వాటిని పాటిస్తే మీరు ధన్యులు.

షేర్ చేయి
Read యోహాను 13

యోహాను 13:3-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు. ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు. సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు” అన్నాడు. యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను. నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.

షేర్ చేయి
Read యోహాను 13

యోహాను 13:3-17 పవిత్ర బైబిల్ (TERV)

తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు. యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు. యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు. పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు. యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు. సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు. తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు. ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా? మీరు నన్ను ‘బోధకుడా!’ అని ‘ప్రభూ!’ అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే! మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం. ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు. ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.

షేర్ చేయి
Read యోహాను 13

యోహాను 13:3-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసి కొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి నప్పుడు అతడు–ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు–నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు–ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి–స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక– మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి–నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువు ను బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.

షేర్ చేయి
Read యోహాను 13