తండ్రి అన్నిటిని తన అధికారం క్రింద ఉంచాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడని యేసుకు తెలుసు. కనుక ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువ్వాలును నడుముకు కట్టుకున్నారు. ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్ళు పోసి, తన శిష్యుల కాళ్ళను కడిగి, తన చుట్టూ కట్టుకొని ఉన్న తువ్వాలుతో వాటిని తుడవడం మొదలుపెట్టారు.
ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు, “ప్రభువా, నీవు నా కాళ్ళు కడుగుతావా?” అని అడిగాడు.
అందుకు యేసు, “నేను చేస్తున్న దానిని ఇప్పుడు మీరు గ్రహించలేరు, కాని తర్వాత గ్రహిస్తారు” అన్నారు.
పేతురు, “లేదు ప్రభువా, నీవు ఎప్పుడు నా కాళ్ళను కడుగకూడదు” అన్నాడు.
అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడుగకపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.
అప్పుడు సీమోను పేతురు, “అయితే ప్రభువా, నా కాళ్ళు మాత్రమే కాకుండా నా చేతులను మరియు తలను కూడా కడుగు!” అన్నాడు.
అందుకు యేసు, “స్నానం చేసినవారి శరీరం మొత్తం శుభ్రంగా ఉంటుంది, కనుక వారు పాదాలను మాత్రం కడుగుకొంటే చాలు; మీరు శుద్ధులే, కాని అందరు కాదు” అని అన్నారు. ఆయనను ఎవరు అప్పగించబోతున్నారో ఆయనకు ముందే తెలుసు, అందుకే ఆయన “మీలో అందరు శుద్ధులు కారు” అన్నారు.
ఆయన వారి కాళ్ళను కడిగి, ఆయన తన వస్త్రాన్ని వేసుకొని తన కూర్చున్న చోటికి తిరిగి వెళ్లి, “నేను మీకు చేసింది మీరు గ్రహిస్తున్నారా?” అని ఆయన వారిని అడిగి ఇలా చెప్పడం మొదలుపెట్టారు: “అవును, మీరు నన్ను ‘బోధకుడని, ప్రభువని’ పిలుస్తున్నారు. నేను అదే అయి ఉన్నాను కనుక ఇలా పిలవడం న్యాయమే. నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ కాళ్ళను కడిగాను, కనుక మీరు కూడ ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను మీ కొరకు చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను. ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకువెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కనుక వాటిని పాటిస్తే మీరు ధన్యులు.