యోహాను 12:23-33
యోహాను 12:23-33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అయితే అది చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకొంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కొరకు కాపాడుకొంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు. “ఇప్పుడు నా హృదయం కలవరం చెందుతుంది, నేను ఏమి చెప్పాలి? ‘తండ్రీ, ఈ గడియలో నుండి నన్ను రక్షించవా?’ వద్దు, ఈ కారణం కొరకే నేను ఈ గడియకు చేరుకొన్నాను. తండ్రీ, నీ నామాన్ని మహిమపరచు!” అన్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దానిని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది. అప్పుడు, అక్కడ నిలబడివున్న జనసమూహం దానిని విని ఉరిమింది అన్నారు. మిగిలిన వారు “దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు. అప్పుడు యేసు, “ఆ స్వరం నా కొరకు రాలేదు అది మీ కొరకే వచ్చింది. ఇప్పుడు లోకానికి తీర్పుతీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం. నేను, భూమి నుండి మీదికి ఎత్తబడినప్పుడు, మానవులందరిని నా దగ్గరకు ఆకర్షించుకొంటాను” అన్నారు. ఆయన తాను పొందబోయే మరణాన్ని సూచిస్తూ ఈ మాటను చెప్పారు.
యోహాను 12:23-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది. మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు. నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు. ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను. తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో” అన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, “నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను.” అప్పుడు, అక్కడ నిలుచుని దాన్ని విన్న జనసమూహం, “ఉరిమింది” అన్నారు. మిగతా వారు, “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు. అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం. నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.” ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు.
యోహాను 12:23-33 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు. “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా! తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.” అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది. అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు. మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు. యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు. ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు. ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.
యోహాను 12:23-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు యేసు వారితో ఇట్లనెను–మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?–తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట–నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి. అందుకు యేసు– ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును; నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.