యోహాను 12:23-33

యోహాను 12:23-33 TCV

అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అయితే అది చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకొంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కొరకు కాపాడుకొంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు. “ఇప్పుడు నా హృదయం కలవరం చెందుతుంది, నేను ఏమి చెప్పాలి? ‘తండ్రీ, ఈ గడియలో నుండి నన్ను రక్షించవా?’ వద్దు, ఈ కారణం కొరకే నేను ఈ గడియకు చేరుకొన్నాను. తండ్రీ, నీ నామాన్ని మహిమపరచు!” అన్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దానిని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది. అప్పుడు, అక్కడ నిలబడివున్న జనసమూహం దానిని విని ఉరిమింది అన్నారు. మిగిలిన వారు “దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు. అప్పుడు యేసు, “ఆ స్వరం నా కొరకు రాలేదు అది మీ కొరకే వచ్చింది. ఇప్పుడు లోకానికి తీర్పుతీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం. నేను, భూమి నుండి మీదికి ఎత్తబడినప్పుడు, మానవులందరిని నా దగ్గరకు ఆకర్షించుకొంటాను” అన్నారు. ఆయన తాను పొందబోయే మరణాన్ని సూచిస్తూ ఈ మాటను చెప్పారు.