యిర్మీయా 7:1-8
యిర్మీయా 7:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు –నీవు యెహోవామందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము–యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలోబడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి –ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి. ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగువానియెడల తప్పక న్యాయము జరిగించి. పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీపితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్ప్రయోజనములు.
యిర్మీయా 7:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా దగ్గర నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు “నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి ఈ మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి. సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీరు ఈ స్థలంలో నివసించడానికి నేను అనుమతించాలంటే మీ మార్గాలు, క్రియలు సరి చేసుకోండి. ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.” మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి. పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు. అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను. అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు.
యిర్మీయా 7:1-8 పవిత్ర బైబిల్ (TERV)
యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది: “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము: “‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవాను ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం; ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు. మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. క్రొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను. “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి.
యిర్మీయా 7:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది: “యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి: “ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి. సైన్యాల యెహోవాయైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నారు: నీ మార్గాలను, నీ క్రియలను సరిచేసుకో, అప్పుడు నేను నిన్ను ఈ స్థలంలో నివాసం చేయిస్తాను. మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!” మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే, మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే, నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను. కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు.