యిర్మీయా 33:11-16

యిర్మీయా 33:10-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే, మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే, సంతోషస్వరమును ఆనంద శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును–యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును;మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మనుష్యులైనను జంతువులైనను లేక పాడైయున్న యీ స్థలములోను దాని పట్టణములన్నిటిలోను గొఱ్ఱెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే–ఇశ్రాయేలు వంశస్థులనుగూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచిమాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.

షేర్ చేయి
Read యిర్మీయా 33

యిర్మీయా 33:11-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సంతోష స్వరం, ఆనంద శబ్దం, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు స్వరాలు ఇలా అంటాయి, ‘సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు స్తుతి చెల్లించండి, యెహోవా మంచివాడు, ఆయన నిబంధనా నమ్మకత్వం నిరంతరం ఉంటుంది.’ స్తుతి అర్పణ నా మందిరంలోకి తీసుకు రండి, ఎందుకంటే ముందు ఉన్నట్టుగానే ఈ దేశపు భాగ్యం మళ్ళీ దానికి కలుగజేస్తాను,” అని యెహోవా అంటున్నాడు. సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “మనుషులు, జంతువులు లేక పాడైపోయిన ఈ పట్టణాలు, కాపరులు తమ గొర్రెలను మేపే ప్రాంతాలుగా, వాటిని విశ్రమింపజేసే ప్రదేశాలుగా ఉంటాయి. మన్య పట్టణాల్లో, మైదానపు పట్టణాల్లో, దక్షిణ దేశపు పట్టణాల్లో, బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించుకుంటూ తిరుగుతారు.” యెహోవా వాక్కు ఇదే. “చూడు! ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చే రోజులు వస్తున్నాయి. ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు కోసం నీతి చిగురు మొలిపిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలను జరిగిస్తాడు. ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”

షేర్ చేయి
Read యిర్మీయా 33

యిర్మీయా 33:11-16 పవిత్ర బైబిల్ (TERV)

అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు. సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి. గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”

షేర్ చేయి
Read యిర్మీయా 33

యిర్మీయా 33:11-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు. “సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మనుష్యులు, జంతువులు లేక నిర్జనమైన ఈ స్థలంలో, దాని పట్టణాలన్నింటిలో గొర్రెల కాపరులు తమ మందలకు విశ్రాంతి ఇచ్చేందుకు మళ్ళీ పచ్చికబయళ్లు ఉంటాయి. కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు. “యెహోవా అంటూ ఇలా ప్రకటిస్తున్నారు, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చే రోజులు వస్తున్నాయి.’ “ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’

షేర్ చేయి
Read యిర్మీయా 33