యిర్మీయా 31:7-26

యిర్మీయా 31:7-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి. చూడు, ఉత్తరదేశంలో నుంచి నేను వాళ్ళను తీసుకురాబోతున్నాను. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను, గర్భిణులను, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలను భూమి సుదూర ప్రాంతాలనుంచి అందరినీ సమకూరుస్తాను. మహా సమూహమై వారిక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు తమ విన్నపాలు చెప్తూ ఉండగా నేను వాళ్ళను నడిపిస్తాను. తిన్ననైన రహదారిలో, సెలయేళ్ల దగ్గరికి వాళ్ళను ప్రయాణం చేయిస్తాను. ఆ మార్గంలో వాళ్ళు తొట్రిల్లరు. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిగా ఉంటాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠసంతానంగా ఉంటాడు.” ప్రజలారా, యెహోవా మాట వినండి. దూరంగా తీరం వెంబడి ఉన్న ప్రాంతాలకు నివేదిక అందించండి. “ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడేలా కాపాడుతున్నాడు” అని చెప్పండి. ఎందుకంటే, మూల్యం చెల్లించి, తనకు మించిన బలం ఉన్న వాడి చేతిలోనుంచి యెహోవా యాకోబును విమోచించాడు. వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు. అప్పుడు కన్యలు నాట్యమాడి ఆనందిస్తారు. యువకులూ వృద్ధులూ కలిసి ఉంటారు. “ఎందుకంటే, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. వాళ్ళ మీద కనికరం చూపించి దుఃఖానికి బదులుగా వాళ్ళు ఆనందించేలా చేస్తాను. సమృద్ధితో యాజకుల జీవితాలను నింపుతాను. నా ప్రజలు నా మంచితనంతో తమను తాము నింపుకుంటారు.” ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలా అంటున్నాడు. “రమాలో ఏడుపు, మహా రోదన స్వరం వినిపిస్తూ ఉంది. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తూ ఉంది. ఆమె పిల్లలు చనిపోయిన కారణంగా ఆదరణ పొందడానికి నిరాకరిస్తూ ఉంది.” యెహోవా ఇలా అంటున్నాడు. “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీళ్లు కార్చకుండా నీ కళ్ళను ఆపుకో, ఎందుకంటే నీ బాధలు ముగిసాయి. నీ పిల్లలు శత్రువు దేశంలోనుంచి తిరిగి వస్తారు,” ఇదే యెహోవా వాక్కు. “భవిష్యత్తు కోసం నీకు ఒక ఆశ ఉంది. నీ సంతానం తిరిగి తమ సరిహద్దుల్లోకి వస్తారు,” ఇది యెహోవా వాక్కు. “నేను కచ్చితంగా ఎఫ్రాయిము దుఃఖించడం విన్నాను, ‘నువ్వు నన్ను శిక్షించావు, నేను శిక్షకు లోనయ్యాను. కాడి మోసే శిక్షణలేని దూడలా ఉన్న నన్ను మళ్ళీ తీసుకురా, అప్పుడు నేను వస్తాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు. నేను నీ వైపు తిరిగిన తరువాత పశ్చాత్తాపం చెందాను. నేను కాడి మోసే శిక్షణ పొందిన తరువాత విచారంతో చాతిని చరుచుకున్నాను. నా చిన్నతనంలో కలిగిన నిందను భరించి నేను అవమానం పొంది సిగ్గుపడ్డాను.’ ఎఫ్రాయిము నా విలువైన బిడ్డ కాదా? అతడు నాకు ప్రియమైన ముద్దు బిడ్డ కాదా? నేనతనికి విరోధంగా మాట్లాడిన ప్రతిసారీ అతన్ని నా ప్రేమపూర్వకమైన మనస్సుకు జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఈ రకంగా అతనికోసం నా హృదయం తపిస్తూ ఉంది. కచ్చితంగా నేను అతనిమీద కనికరం చూపిస్తాను.” ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారీ, రహదారిలో గుర్తులు పెట్టించుకో. దోవ చూపే స్థంభాలు పాతించుకో. నువ్వు వెళ్ళాల్సిన సరైన దారివైపు నీ మనస్సు నిలుపుకో. తిరిగి రా, నీ పట్టణాలకు తిరిగిరా. నమ్మకద్రోహం చేసే అమ్మాయీ, నువ్వు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుతావు? యెహోవా భూమి మీద కొత్త సృష్టి చేశాడు. బలవంతులైన పురుషులను సంరక్షించడానికి స్త్రీలు వారి చుట్టూ ఆవరిస్తున్నారు. ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, “ప్రజలను నేను తమ దేశానికి తిరిగి తీసుకొచ్చిన తరువాత, యూదా దేశంలో, దాని పట్టణాల్లో ప్రజలు ఇలా అంటారు, ‘పవిత్ర పర్వతమా, న్యాయశీలి నివసించే ప్రదేశమా, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక,’ యూదా, అతని ఇతర పట్టాణాలన్నీ దానిపై సహజీవనం చేస్తారు. రైతులు, గొర్రెల కాపరులు తమ మందలతో సహా అక్కడ ఉంటారు. ఎందుకంటే అలసినవాళ్ళు తాగడానికి నీళ్ళిస్తాను. దప్పికతో బాధపడుతున్న వాళ్ళందరి కడుపు నింపుతాను.” అటు తరువాత నాకు మెలుకువ వచ్చి లేచాను, అప్పుడు, నా నిద్ర నాకు హాయిగా ఉన్నట్టు గమనించాను.

షేర్ చేయి
Read యిర్మీయా 31

యిర్మీయా 31:7-26 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సంతోషంగా ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి! రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విషయంలో ఎలుగెత్తి చాటండి. మీ స్తుతి గీతాలు పాడండి! ఇలా చాటి చెప్పండి: ‘యెహోవా తన ప్రజలను కాపాడినాడు! ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు!’ ఉత్తరాన గల దేశం నుండి ఇశ్రాయేలీయులను తీసికొని వస్తానని తెలిసికొనండి. భూమి మీద వివిధ దూర దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలును నేను తిరిగి కూడదీస్తాను. వారిలో చాలా మంది గుడ్డి వారు, కుంటివారు అయ్యారు. కొందరు స్త్రీలు నిండు గర్భిణీలై కనటానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు. వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల ప్రక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా విధంగా వారికి దారి చుపుతాను. కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు. “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి! ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి. ‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ సర్వోన్నతుడే తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు. గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’ యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు. యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విలసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు. ఇశ్రాయేలు యువతులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు. వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను! యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది! యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: “రామాలో రోదన వినవచ్చింది. అది ఒక తీవ్రమైన రోదన; గొప్ప విషాదం. రాహేలు తన పిల్లలు హతులైన కారణంగా ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరిస్తుంది.” కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విలపించుట ఆపి వేయుము. నీవు కంట తడి పెట్టవద్దు! నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది!” ఇది యెహోవా సందేశం. “ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రు రాజ్యం నుండి తిరిగి వస్తారు. కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.” ఇది యెహోవా వాక్కు. “నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు. ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను. ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను: ‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను. నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను. దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము. నేను తిరిగి నీ యొద్దకు వస్తాను. నీవే నిజమైన నా యెహోవా దేవుడవు. యెహోవా, నేను నీకు దూరమయ్యాను. కాని నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను. కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, హృదయ పరివర్తన కలిగియున్నాను. నా చిన్న తనంలో నేను చేసిన మూర్ఖపు పనులకు సిగ్గుపడి కలవరపడియున్నాను.’” దేవుడు ఇలా చెప్పుచున్నాడు: “ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను. అయినా నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” ఇది యెహోవా సందేశం. “ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెలకొల్పండి. ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను నిలబెట్టండి. మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి. మీరు పయనించే దారిని శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండండి. ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి రమ్ము! నీ నగరాలకు తిరిగిరా. నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు. కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు? “నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహోవా సృష్టించినప్పుడు ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.” ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళ్లీ ఇలా అంటారు: ‘ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను దీవించు గాక!’ “యూదా పట్టణాలలోని ప్రజలంతా శాంతి యుత సహాజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాంతంగా కలిసి జీవిస్తారు. బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.” అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.

షేర్ చేయి
Read యిర్మీయా 31

యిర్మీయా 31:7-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి–యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి. ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి–ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవాచేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. –నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు–నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.

షేర్ చేయి
Read యిర్మీయా 31

యిర్మీయా 31:7-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా ఇలా అంటున్నారు: “యాకోబు కోసం ఆనందంగా పాడండి; దేశాల్లో గొప్పదాని కోసం కేకవేయండి. స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, ఇశ్రాయేలీయులలో మిగిలిన, నీ ప్రజలను రక్షించండి’ అని అనండి. చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; గొప్ప గుంపు తరలివస్తుంది. వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు. “జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’ ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు. వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు. అప్పుడు యువతులు యువకులు, వృద్ధులు సంతోషంతో నాట్యం చేస్తారు. నేను వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను; నేను వారికి విచారానికి బదులుగా ఆదరణను, ఆనందాన్ని ఇస్తాను. నేను యాజకులను సమృద్ధితో తృప్తిపరుస్తాను, నా ప్రజలు నా సమృద్ధితో నింపబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన, గొప్ప ఏడ్పు వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.” యెహోవా ఇలా చెప్తున్నారు: “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీరు పెట్టుకోకుండా నీ కళ్లను అడ్డుకో, ఎందుకంటే నీ పనికి ప్రతిఫలం లభిస్తుంది, వారు శత్రువుల దేశం నుండి తిరిగి వస్తారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు. “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు. నేను దారితప్పిన తర్వాత, పశ్చాత్తాపపడ్డాను; నేను అర్థం చేసుకున్న తర్వాత, నా రొమ్ము కొట్టుకున్నాను. నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’ ఎఫ్రాయిం నా ప్రియ కుమారుడు, నేను ఇష్టపడే బిడ్డ కాదా? నేను తరచుగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నేను ఇప్పటికీ అతన్ని జ్ఞాపకముంచుకుంటాను. కాబట్టి నా హృదయం అతని కోసం ఆశపడుతుంది; అతని మీద నాకు చాలా కనికరం ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “రహదారి గుర్తులను ఏర్పాటు చేయి; దారి చూపే స్తంభాలు పెట్టించు. నీవు వెళ్లే మార్గాన్ని, ఆ రహదారిని గమనించు. ఇశ్రాయేలు కన్యా, నీ పట్టణాలకు తిరిగి రా. విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, నీవు ఎంతకాలం తిరుగుతావు? యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, స్త్రీ పురుషుని దగ్గరకు తిరిగి వస్తుంది.” ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు, యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’ రైతులు, తమ మందలతో తిరిగే కాపరులతో సహా యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలందరూ కలిసి జీవిస్తారు. అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.” అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది.

షేర్ చేయి
Read యిర్మీయా 31