యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి–యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి. ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి–ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవాచేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. –నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు–నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను.