యిర్మీయా 23:5-8
యిర్మీయా 23:5-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక ఉత్తర దేశములోనుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలోనుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.
యిర్మీయా 23:5-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు. ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.” కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు “ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవం తోడు” అని ఇకపై ప్రమాణం చెయ్యరు. “ఉత్తర దేశంలో నుంచి, నేను వారిని చెదరగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వారిని రప్పించిన యెహోవానైన నా తోడు” అని ప్రమాణం చేస్తారు. వాళ్ళు తమ దేశంలో నివసిస్తారు అని యెహోవా చెబుతున్నాడు.
యిర్మీయా 23:5-8 పవిత్ర బైబిల్ (TERV)
“నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని మొలిపింప జేసే సమయం వస్తూవుంది,” ఇదే యెహోవా వాక్కు. అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు. దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు. శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు. ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది. “యెహోవా మనకు న్యాయం” అని అతనికి పేరుగా ఉంటుంది. కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు. కాని ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు’ అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”
యిర్మీయా 23:5-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“రాబోయే రోజుల్లో, నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను, జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు, దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’ అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”