యిర్మీయా 23
23
1యెహోవా వాక్కు ఇదే–నా మందలో చేరిన . గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. 2ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు –మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు. 3మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును. 4నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.
5యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. 6అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు. 7కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక 8ఉత్తర దేశములోనుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలోనుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.
9ప్రవక్తలనుగూర్చినది. యెహోవానుగూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలనుగూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలుచున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను. 10దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను. 11ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు. 12వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు. 13షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. 14యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.
15కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగా–యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను. 16సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. 17వారు నన్ను తృణీకరించు వారితో–మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడవగా వానితో–మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు. 18యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు? 19ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును. 20తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. 21నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు. 22వారు నా సభలో చేరిన వారైనయెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు. 23–నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా? 24యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా–నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు. 25–కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. 26ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమునుబట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా? 27బయలును పూజింపవలెనని తమపితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా? 28కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. 29నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?
30కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు. 31స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు. 32మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు. 33మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము–మీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు 34–ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను. 35అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశ్నించవలెను. 36యెహోవా భారమను మాట మీరికమీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును. 37యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నాడనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తినయెడల 38అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు. 39కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీపితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను. 40ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 23: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.