న్యాయాధిపతులు 6:1-16

న్యాయాధిపతులు 6:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా ఏడు సంవత్సరాల పాటు వాళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు విత్తనాలు చల్లిన తరువాత, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున ఉండేవాళ్ళు, తమ పశువులతో, గుడారాలతో సహా మిడతల దండు లాగా వాళ్ళ మీదికి వచ్చి వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని, గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక్క గొర్రెనుగానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ, దేనినీ మిగల్చలేదు. వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి. దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు. మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ‘ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను. ఐగుప్తీయుల చేతిలో నుంచి, మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.’” అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు, గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు. అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు. అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు. అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు.

న్యాయాధిపతులు 6:1-16 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా చెడ్డవి అని చెప్పిన సంగతులనే ఇశ్రాయేలు ప్రజలు మరల చేసారు. అందుచేత యెహోవా మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఏడు సంవత్సరాల వరకు ఓడింపనిచ్చాడు. మిద్యాను ప్రజలు చాలా శక్తిగలవారు మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల చాలా క్రూరులు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండలలో దాగుకొనే స్థలాలు అనేకం చేసుకున్నారు. వారి భోజనాన్ని గుహలలోను, కనుక్కొనేందుకు కష్టతరమైన స్థలాలలోను దాచుకున్నారు. తూర్పు ప్రాంతంనుండి మిద్యానీయులు, అమాలేకీయులు ఎల్లప్పుడు వచ్చి వారి పంటలను పాడుచేసేవారు గనుక వారు అలా చేశారు. ఆ మనుష్యులు దేశంలో బసచేసి, ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి కోసం గొర్రెలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని ఏమీ వారు విడిచిపెట్టలేదు. మిద్యానీయులు వచ్చి ఆ దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మనుష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత లెక్కించుటకు అసాధ్యం అయింది. ఈ మనుష్యులంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు. మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. మిద్యానీయులు ఆ చెడ్డ పనులన్నీ చేశారు. కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. కనుక యెహోవా వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఇదే: ‘మీరు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను. ఈజిప్టు యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. ఆ ప్రజలు వారి దేశం వదిలి పోయేటట్టు నేను చేశాను. మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.’ ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు చెప్పాను. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను.’ కాని మీరు నాకు విధేయులు కాలేదు.” ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవాదూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజ్రీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవాదూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా, యెహోవాదూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు. అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.” యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు. అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు. యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.

న్యాయాధిపతులు 6:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయులమీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధనమైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను – ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని. ఐగుప్తీయుల చేతిలోనుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితినిగాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవాదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా యెహోవాదూత అతనికి కనబడి–పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతనితట్టు తిరిగి–బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు –చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా–అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 6:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇశ్రాయేలీయులు యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని ఏడు సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు తమను చాలా క్రూరంగా అణచివేయడంతో ఇశ్రాయేలీయులు తమ కోసం పర్వతాల్లో, గుహల్లో, బలమైన కోటలలో సురక్షితమైన స్థలాలు సిద్ధపరచుకున్నారు. ఇశ్రాయేలీయులు పంటలు వేసినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పున ఉండే ప్రజలు ఆ దేశం మీద దాడి చేసేవారు. వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు. వారు తమ పశువులతో, గుడారాలతో మిడతల దండులా వచ్చారు. వారిని, వారి ఒంటెలును లెక్కించడం అసాధ్యం; భూమిని నాశనం చేయడానికి దానిని ఆక్రమించుకున్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధించారు కాబట్టి సహాయం కోసం వారు యెహోవాను వేడుకున్నారు. మిద్యానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నప్పుడు, ఆయన వారి కోసం ఒక ప్రవక్తను పంపారు. అతడు ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాను. ఈజిప్టువారి చేతి నుండి మిమ్మల్ని రక్షించాను. మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుండి విడిపించాను; మీ ఎదుట నుండి వారిని తరిమేసి వారి దేశాన్ని మీకిచ్చాను. నేను మీతో, ‘మీ దేవుడనైన యెహోవాను నేనే; మీరు నివసించే అమోరీయుల దేశంలో వారి దేవుళ్ళకు భయపడకూడదు’ అని చెప్పాను కాని మీరు నా మాట వినలేదు.” యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు. యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు. అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు. అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి అన్నారు, “నీకున్న బలంతో వెళ్లి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు. నేనే కదా నిన్ను పంపిస్తుంది?” గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.” యెహోవా అతనితో, “నేను నీతో ఉంటాను, నీవు ఒక్కడివే ఓడిస్తున్నట్టు మిద్యానీయులందరిని ఓడిస్తావు” అన్నారు.