ఇశ్రాయేలీయులు యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని ఏడు సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు తమను చాలా క్రూరంగా అణచివేయడంతో ఇశ్రాయేలీయులు తమ కోసం పర్వతాల్లో, గుహల్లో, బలమైన కోటలలో సురక్షితమైన స్థలాలు సిద్ధపరచుకున్నారు. ఇశ్రాయేలీయులు పంటలు వేసినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పున ఉండే ప్రజలు ఆ దేశం మీద దాడి చేసేవారు. వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు. వారు తమ పశువులతో, గుడారాలతో మిడతల దండులా వచ్చారు. వారిని, వారి ఒంటెలును లెక్కించడం అసాధ్యం; భూమిని నాశనం చేయడానికి దానిని ఆక్రమించుకున్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధించారు కాబట్టి సహాయం కోసం వారు యెహోవాను వేడుకున్నారు.
మిద్యానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నప్పుడు, ఆయన వారి కోసం ఒక ప్రవక్తను పంపారు. అతడు ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాను. ఈజిప్టువారి చేతి నుండి మిమ్మల్ని రక్షించాను. మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుండి విడిపించాను; మీ ఎదుట నుండి వారిని తరిమేసి వారి దేశాన్ని మీకిచ్చాను. నేను మీతో, ‘మీ దేవుడనైన యెహోవాను నేనే; మీరు నివసించే అమోరీయుల దేశంలో వారి దేవుళ్ళకు భయపడకూడదు’ అని చెప్పాను కాని మీరు నా మాట వినలేదు.”
యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు. యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు.
అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు.
అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి అన్నారు, “నీకున్న బలంతో వెళ్లి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు. నేనే కదా నిన్ను పంపిస్తుంది?”
గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.”
యెహోవా అతనితో, “నేను నీతో ఉంటాను, నీవు ఒక్కడివే ఓడిస్తున్నట్టు మిద్యానీయులందరిని ఓడిస్తావు” అన్నారు.