న్యాయాధిపతులు 16:23-31
న్యాయాధిపతులు 16:23-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫిలిష్తీయుల అధికారులు “మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు” అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు. అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి “మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు” అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు. వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు “సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం” అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు. సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను” అన్నాడు. ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి” అని యెహోవాకు మొర్ర పెట్టాడు. ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు. “నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం” అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ. అప్పుడు అతని సహోదరులూ, అతని తండ్రి ఇంటివారూ వచ్చి అతణ్ణి తీసుకు వెళ్ళారు. అతణ్ణి జోర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న అతని తండ్రియైన మానోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.
న్యాయాధిపతులు 16:23-31 పవిత్ర బైబిల్ (TERV)
ఫిలిష్తీయుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవాలనుకున్నారు. తమ దేవుడైన దాగోనుకు పెద్ద బలి కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమ్సోనును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు.” అని అనుకున్నారు. సమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశంసించారు. వారు ఇలా అన్నారు: “ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు. ఈ మనిషి మనవారిలో పలువురిని చంపాడు, కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు!” ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సోనును వెలికి తీసుకురండి. అతనిని చూసి మేము పరిహాసం చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్సోనును బయటికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సమ్సోనును నిలబెట్టారు. ఒక సేవకుడు సమ్సోను చెయ్యి పట్టుకున్నాడు. అతనితో సమ్సోను, “ఈ ఆలయానికి ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచు. వాటిని ఆనుకుని వుంటాను” అన్నాడు. ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడుతున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల మంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారందరూ సమ్సోనును చూసి ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు యెహోవాను సమ్సోను స్తుతించాడు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు. అప్పుడు ఆలయం మధ్య వున్న రెండు స్తంభాలను సమ్సోను పట్టుకున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తున్నవి. ఆ రెండు స్తంభాలను అతను కౌగిలించుకున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వైపున వున్నది. మరొకటి ఎడమ చేతివైపున వున్నది. సమ్సోను ఇలా అన్నాడు; “ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తికొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాలకులు మరియు మనుష్యుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటికంటె మరణ సమయంలోనే, చాలా మందిని చంపి వేశాడు. సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.
న్యాయాధిపతులు 16:23-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఫిలిష్తీయుల సర్దారులు–మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సమ్సో నును చూచినప్పుడు–మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు–మనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభములమధ్యను అతని నిలువబెట్టి పరిహాసముచేయగా సమ్సోను తనచేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను–ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారులందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళిచేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి. అప్పుడు సమ్సోను –యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారులమీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
న్యాయాధిపతులు 16:23-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఫిలిష్తీయుల నాయకులు, “మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు” అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు. ఆ ప్రజలు అతన్ని చూసి, “మన దేవుడు మన శత్రువును మన చేతులకు అప్పగించాడు, మన దేశాన్ని పాడు చేసినవాన్ని, మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు” తమ దేవున్ని పొగిడారు, వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, “మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!” అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు. వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు, తన చేయి పట్టుకున్న దాసునితో సంసోను, “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేను వాటిని ఆనుకుని నిలబడతాను” అని అడిగాడు. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఫిలిష్తీయుల నాయకులందరు అక్కడే ఉన్నారు, సంసోను చేస్తున్న వినోదాన్ని గుడి కప్పు మీది నుండి దాదాపు మూడువేలమంది స్త్రీ పురుషులు చూస్తున్నారు. అప్పుడు సంసోను, “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను” అని ప్రార్థన చేశాడు. తర్వాత సంసోను గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో కుడిచేతితో ఒకదాన్ని ఎడమచేతితో ఒకదాన్ని పట్టుకుని, సంసోను, “నేను నాతోపాటు ఫిలిష్తీయులు కలిసి చస్తాం” అంటూ బలంగా ముందుకు వంగాడు! అంతే ఆ గుడి దానిలో ఉన్న అధికారులు ప్రజలు అందరి మీదా కూలి, అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపాడు. అప్పుడు అతని సోదరులు, తండ్రి ఇంటివారందరు అతన్ని మోసికొనివచ్చి అతన్ని జోరహుకును ఎష్తాయోలుకును మధ్యలో ఉన్న అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇశ్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు.