న్యాయాధిపతులు 16
16
1తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను. 2సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. 3సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను.
4పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా 5ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో–నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి. 6కాబట్టి దెలీలా–నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా 7సమ్సోను–ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను. 8ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను. 9మాటుననుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. 10అప్పుడు దెలీలా–ఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా 11అతడు–పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను 12అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి– సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములోనుండిరి. అతడు తన చేతులమీదనుండి నూలుపోగునువలె ఆ తాళ్లు తెంపెను. 13అప్పుడు దెలీలా–ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను. 14అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను. 15అప్పుడు ఆమె–నాయందు నీకిష్టము లేనప్పుడు –నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను. 16ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. 17అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి–నేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను. 18అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి–యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమెయొద్దకు రాగా 19ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీదియేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను. 20ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. 21అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి. 22అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలుతిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను.
23ఫిలిష్తీయుల సర్దారులు–మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. 24జనులు సమ్సో నును చూచినప్పుడు–మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. 25వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు–మనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభములమధ్యను అతని నిలువబెట్టి పరిహాసముచేయగా 26సమ్సోను తనచేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను–ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును. 27ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారులందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళిచేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి. 28అప్పుడు సమ్సోను –యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి 29ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని 30నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారులమీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను. 31అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 16: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.