న్యాయాధిపతులు 16:1-31
న్యాయాధిపతులు 16:1-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు. సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు. సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు. ఆ తరువాత సంసోను శోరేకు లోయలో నివాసముండే ఒక స్త్రీని ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా. ఫిలిష్తీయుల అధికారులు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో “నువ్వు అతణ్ణి ఏమార్చి అతడి గొప్ప బలం దేంట్లో ఉందో, మేము అతణ్ణి బంధించడానికి ఎలా అతణ్ణి గెలవవచ్చో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణచివేస్తాం. నువ్వు దీన్ని చేస్తే మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి నాణేలిస్తాం” అన్నారు. కాబట్టి దెలీలా “నువ్వు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటో, నిన్ను ఓడించాలంటే దేంతో నిన్ను బంధించాలో దయచేసి నాకు చెప్పు” అని సంసోనును అడిగింది. దానికి సంసోను “ఏడు పచ్చి వింటినారలతో నన్ను కట్టిపడేస్తే నాలో బలం పోయి అందరిలానే ఉంటాను” అన్నాడు. ఫిలిష్తీయుల అధికారులు ఏడు పచ్చి వింటినారలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వాటితో అతణ్ణి బంధించింది. ఆమె ఇంట్లోని లోపలి గదిలో కొంతమంది దాగి ఉన్నారు. ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. అతడు తనను బంధించిన వింటినారలను కాలిపోయిన నారపోగుల్లా తెంపేశాడు. కాబట్టి అతని బలం వెనుక రహస్యం వెల్లడి కాలేదు. అప్పుడు దెలీలా “చూడు, నువ్వు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. దయచేసి నిన్ను ఎలా లొంగదీసుకోవచ్చో నాకు చెప్పు” అని సంసోనుతో అంది. సంసోను “కొత్తగా పేనిన, ఇంత వరకూ వాడని తాళ్ళతో నన్ను బంధించాలి. అప్పుడు నేను అందరిలాగా బలహీనుడి నౌతాను” అన్నాడు. అప్పుడు దెలీలా కొత్తగా పేనిన తాళ్లతో అతణ్ణి బంధించింది. “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అని సంసోనుతో అంది. అప్పటికే ఆమె గదిలో కొందరు వేచి చూస్తున్నారు. సంసోను లేచి ఆ తాళ్ళను నూలు పోగుల్లా తెంపేశాడు. అప్పుడు దెలీలా “ఇప్పటివరకూ నువ్వు నన్ను మోసం చేస్తూ అబద్ధమే చెప్పావు. దేనితో నిన్ను బంధించవచ్చో నాకు చెప్పు” అంది. అప్పుడు సంసోను “నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గంలో నేతలాగ అల్లితే సరి” అన్నాడు. అప్పుడు అతడు నిద్రిస్తున్నప్పుడు ఆమె అతని తలపై ఏడు జడలు మగ్గంపై అల్లి మేకుతో మగ్గానికి దిగగొట్టింది. తరువాత “సంసోనూ, ఫిలిష్తీయులు వచ్చేశారు!” అంటూ అతణ్ణి నిద్ర లేపింది. సంసోను నిద్ర నుండి లేచి మగ్గపు మేకునూ నేతనూ ఊడబెరికాడు. అప్పుడు ఆమె “నీ రహస్యాలేవీ నాకు చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనగలుగుతున్నావు? ఇప్పటికి మూడు సార్లు నన్ను మోసం చేశావు. నీ మహాబలం దేనిలో ఉందో ఇంతవరకూ నాకు చెప్పలేదు” అంది. ఇక ఆమె ప్రతిరోజూ తన మాటలతో అతణ్ణి విసికించడం ప్రారంభించింది. దాంతో అతనికి విసుగు పుట్టి “చావే నయం” అనిపించింది. అప్పుడు సంసోను సమస్తం ఆమెకు తెలియచేశాడు. “నేను పుట్టిన దగ్గర్నుంచి మంగలి కత్తి నా తలపైకి రాలేదు. ఎందుకంటే నేను నా తల్లి గర్భంలోనే దేవునికి నాజీరుగా ఉన్నాను. నా తలపై జుట్టును క్షౌరం చేస్తే నేను అందరిలాగానే సామాన్యుడిగా మారతాను” అని ఆమెకు చెప్పాడు. అతడు తన రహస్యాన్ని చెప్పేశాడని దెలీలాకు అర్థమైంది. ఆమె ఫిలిష్తీయుల అధికారులకు కబురు పంపింది. “మరోసారి రండి. ఇతను నాకు తన రహస్యాన్ని చెప్పాడు” అంది. ఫిలిష్తీయుల అధికారులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్ర పోయేలా చేసి ఒక మనిషిని పిలిపించి అతని ద్వారా సంసోను తల పై ఉన్న ఏడు జడలనూ క్షౌరం చేయించింది. అతణ్ణి లొంగదీసుకోసాగింది. ఎందుకంటే అప్పటికి అతనిలోని బలం తొలగిపోయింది. ఆమె “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చేస్తున్నారు!” అంది. సంసోను నిద్ర లేచి “ఎప్పటి లానే లేచి విసిరికొట్టి విడిపించుకుంటాను” అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచి పెట్టాడని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతణ్ణి బంధించి అతని కళ్ళు ఊడబెరికారు. గాజాకు అతణ్ణి తీసుకు వచ్చి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు. అతణ్ణి చెరసాల్లో తిరగలి విసరడానికి పెట్టారు. కాని క్షౌరం చేశాక అతని తలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమయ్యాయి. ఫిలిష్తీయుల అధికారులు “మన దేవుడు మన శత్రువైన సంసోనును జయించి మన చేతికి అప్పగించాడు” అని చెప్పుకుని, వారి దేవుడైన దాగోనుకు గొప్ప బలి అర్పించడానికీ, పండగ చేసుకోడానికీ ఒక చోట చేరారు. అక్కడ చేరిన ప్రజలంతా దాగోనును చూసి “మన దేశాన్ని నాశనం చేసి మనలో అనేకులను చంపిన మన శత్రువును మన దేవుడు జయించాడు” అంటూ తమ దేవుణ్ణి కీర్తించారు. వాళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు “సంసోనును తీసుకు రండి. అతణ్ణి చూసి ఎగతాళి చేసి నవ్వుదాం” అన్నారు. వాళ్ళు అతణ్ణి తీసుకు వచ్చి రెండు స్తంభాల మధ్య అతణ్ణి నిలబెట్టారు. సంసోను తన చెయ్యి పట్టుకుని ఉన్న కుర్రాడితో “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను ఆనుకుని నిల్చుంటాను” అన్నాడు. ఆ ఆలయం అంతా స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల అధికారులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సంసోనును ఎగతాళి చేస్తున్నారు. ఆలయం కప్పు పైన సుమారు మరో మూడు వేలమంది స్త్రీలూ పురుషులూ చూస్తూ ఉన్నారు. అప్పుడు సంసోను “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారికి నాకు బలం దయచెయ్యి. నా కళ్ళు ఊడబెరికిన వారిపై నన్ను పగ తీర్చుకోనీయి” అని యెహోవాకు మొర్ర పెట్టాడు. ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు. “నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం” అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ. అప్పుడు అతని సహోదరులూ, అతని తండ్రి ఇంటివారూ వచ్చి అతణ్ణి తీసుకు వెళ్ళారు. అతణ్ణి జోర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న అతని తండ్రియైన మానోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.
న్యాయాధిపతులు 16:1-31 పవిత్ర బైబిల్ (TERV)
ఒకనాడు సమ్సోను గాజా నగరానికి వెళ్లాడు. అక్కడ అతనొక వ్యభిచారిణిని చూశాడు. ఆ రాత్రి ఆమెతో గడిపేందుకు అతను అక్కడికి వెళ్లాడు. ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్పాడు: “సమ్సోను ఇక్కడికి వచ్చాడు.” సమ్సోనును చంపాలని వారనుకున్నారు. అందువల్ల వారు నగరాన్ని చుట్టు ముట్టారు. వారు నగర ద్వారం వద్ద దాగివున్నారు. ఆ రాత్రి అంతా సమ్సోను కోసం చాలా వేచివున్నారు. నిశ్శబ్దంగా వారు ఒకరితో ఒకరు, “ప్రొద్దు పొడవగానే, మనం సమ్సోనును చంపుదాము” అని చెప్పుకున్నారు. కాని సమ్సోను ఆ వ్యభిచారిణితో అర్థరాత్రి వరకే ఉన్నాడు. అర్థరాత్రి వేళ సమ్సోను లేచాడు. నగర ద్వారం తలుపుల్ని అతను లాగివేశాడు. గోడనుండి వాటిని సడలింపజేశాడు. సమ్సోను తలుపులను క్రిందికి లాగివేశాడు. రెండు స్తంభాలను, తలుపుల్ని మూసివేసి ఉంచిన అడ్డగడియలను లాగివేశాడు. సమ్సోను, వాటిని తన భుజాల మీద వేసుకుని, హెబ్రోను నగరానికి సమీపాన ఉన్న కొండ మీదికి మోసుకుని పోయాడు. తర్వాత సమ్సోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఆమె శోరేకు అనే లోయకు చెందింది. ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు వెళ్లారు. వారు అన్నారు; “సమ్సోను అంత బలవంతుడు కావడానికి గల కారణమేమిటో తెలుసుకోదలచాము. ఏదో ఒక ఉపాయం పన్ని ఆ రహస్యాన్ని అతని నుంచి రప్పించు. అప్పుడు అతనిని ఎలా పట్టుకొని బంధించాలో తెలుసుకుంటాము. ఆ తర్వాత అతన్ని అదుపులో ఉంచగలము. నీవు కనుక ఇది చేయగలిగితే, నీకు మాలో ఒక్కొక్కరు ఇరవై ఎనిమిది పౌండ్లు వెండి యిస్తాము.” అప్పుడు దెలీలా సమ్సోనుతో, “నీవెందుకు అంత బలవంతుడవైయున్నావో చెప్పు. ఎవరైనా నిన్ను బంధించి నిస్సహాయుణ్ణి చేయగలుగుతారా, చెప్పు?” అని అడిగింది. సమ్సోను బదులు చెప్పాడు, “ఎవరైనా నన్ను ఇంకా తడి ఆరని కొత్త వింటినారులు ఏడింటితో బంధించాలి. అలా ఎవరైనా చేయగలిగితే, అప్పుడు ఇతర మనిషిలాగ బలహీనుణ్ణి అవుతాను.” అప్పుడు ఫిలిష్తీయుల పాలకులు కొత్త వింటి నారులు ఏడు దెలీలా వద్దకు తీసుకువచ్చారు. అవి ఇంకా తడియారలేదు. ఆ వింటి నారులతో దెలీలా సమ్సోనును బంధించింది. కొంతమంది మగవాళ్లు పక్క గదిలో దాగి ఉన్నారు. దెలీలా సమ్సోనుతో ఇలా చెప్పింది; “సమ్సోనూ! ఫిలిష్తీయులు నిన్ను ఇప్పుడు పట్టుకోనున్నారు” అంది. కాని సమ్సోను సులభంగా ఆ వింటినారులు తెంచుకున్నాడు. అగ్నిలో మండిపోయిన దారంలా, బూడిదలా అవి తెగిపోయాయి. అందువల్ల ఫిలిష్తీయులు సమ్సోను బలానికిగల రహస్యాన్ని కనుగొనలేక పోయారు. అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “నీవు నాతో అబద్ధం చెప్పావు. దయచేసి నాకు నిజం చెప్పండి. నిన్ను ఎవరైనా ఎలా బంధించగలరు?” సమ్సోను ఇలా అన్నాడు; “ఎవరైనా నన్ను కొత్త తాళ్లతో కట్టివేయాలి. అంతకు పూర్వం వాడనటువంటి కొత్త తాళ్లతో నన్ను కట్టివేయాలి. ఎవరైనా అలా చేయగలిగితే, నేను ఇతరులవలె బలహీనుణ్ణి అవుతాను.” అందువల్ల దెలీలా కొత్త తాళ్లు తీసుకుంది. వాటితో సమ్సోనును కట్టివేసింది. పక్క గదిలో కొందరు మనుష్యులు దాగి ఉన్నారు. తర్వాత దెలీలా “సమ్సోనూ, ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను పట్టుకుంటారు.” అన్నది. కాని అతను ఆ తాళ్లు సునాయాసంగా తెంచుకున్నాడు. దారాలను తెంపినంత సులభంగా వాటిని తెంచివేశాడు. తర్వాత దెలీలా, “మళ్లీ నువ్వు అబద్ధం చెప్పావు. నన్ను అవివేకిగా చేశావు. ఇప్పుడైనా చెప్పు, ఎవరైనా నిన్ను ఎలా బంధించగలరో.” అని సమ్సోనుతో చెప్పింది. “నా తలమీది వెంట్రుకలతో ఏడుజడలను అల్లగలిగి, వాటిని ఒక మేకుతో బిగించినట్లయితే అప్పుడు ఇతర మనుష్యుల్లా నేను బలహీనుణ్ణి అవుతాను” అని సమ్సోను చెప్పాడు. తర్వాత సమ్సోను నిద్రపోయాడు. అప్పుడు అతని తలమీది వెంట్రుకలను అల్లింది. తర్వాత దెలీలా గుడారం మేకుతో మగ్గాన్ని నేలకు బిగించింది, అతనిని చూసి ఇలా అన్నది. “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకుంటారు.” సమ్సోను ఆ గుడారం మేకుని, మగ్గాన్ని లాగివేశాడు. అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అని నీవు ఎలా చెప్పగలవు? నా మీద నీకు నమ్మకం కూడా లేదు. నీవు మూడవ సారిగా నన్ను అవివేకిని చేశావు. నీ మహా బలానికిగల రహస్యాన్ని చెప్పనే లేదు.” ఇలా ప్రతిరోజూ ఆమె సమ్సోనును వేధించుకు తినసాగింది. ఆమె అలా వేధించుకు తినడం చూసి అతను విసిగిపోయాడు. మరణం సంభవించేలా అనిపించింది. చివరికి సమ్సోను దెలీలాతో అన్నీ చెప్పాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా జుట్టుని గొరిగించుకొనలేదు. నేను పుట్టుటకు మునుపే, నన్ను దేవునికి అర్పించారు. ఎవరైనా నా తలను గొరిగినట్లయితే, అప్పుడు నా బలాన్ని కోల్పోతాను. ఇతర మనుష్యుల్లా నేనప్పుడు బలహీనుణ్ణి అవుతాను.” సమ్సోను తన రహస్యాన్ని చెప్పినట్లుగా దెలీలా గ్రహించింది. ఫిలిష్తీయుల పరిపాలకులకు ఒక సందేశం పంపింది. ఆమె ఇలా చెప్పింది: “మళ్లీ రండి. సమ్సోను నాతో అన్నీ చెప్పాడు.” అందువల్ల ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు మళ్లీ వచ్చారు. తమతో పాటు వాళ్లు మాట యిచ్చిన ప్రకారం డబ్బు కూడా తీసుకు వచ్చారు. సమ్సోను తన తొడమీద పడుకుని వున్నప్పుడు దెలీలా అతనిని నిద్ర పుచ్చింది. అప్పుడొక వ్యక్తిని లోనికి పిలిచి, సమ్సోను తల వెంట్రుకలను గొరిగి వేయమనింది. ఈ విధంగా సమ్సోనుని ఆమె బలహీనపరిచింది. సమ్సోను బలహీనుడయ్యాడు. అప్పుడు అతణ్ణి లేవమని చెప్పి, “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకోనున్నారు” అని ఆమె చెప్పింది. అతను మేల్కొన్నాడు. ఆలోచన చేశాడు, “నేను పూర్వం చేసినట్లుగా చేసి తప్పించుకుంటాను. స్వతంత్రుణ్ణి అవుతాను.” కాని యెహోవా అతనిని విడనాడి వెళ్లినట్లు సమ్సోను గ్రహించలేదు. ఫిలిష్తీయులు సమ్సోనును పట్టుకున్నారు. వారతని కళ్లు పెరికి వేశారు. గాజా నగరానికి తీసుకుని వెళ్లారు. అతను పారిపోకుండా ఉండేందుకుగాను, సంకెళ్లతో బంధించారు. వారు సమ్సోనును చెరసాలలో ఉంచారు. అతని చేత ధాన్యం విసిరించారు. కాని సమ్సోను వెంట్రుకలు మళ్లీ మొలవసాగాయి. ఫిలిష్తీయుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవాలనుకున్నారు. తమ దేవుడైన దాగోనుకు పెద్ద బలి కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమ్సోనును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు.” అని అనుకున్నారు. సమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశంసించారు. వారు ఇలా అన్నారు: “ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు. ఈ మనిషి మనవారిలో పలువురిని చంపాడు, కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు!” ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సోనును వెలికి తీసుకురండి. అతనిని చూసి మేము పరిహాసం చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్సోనును బయటికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సమ్సోనును నిలబెట్టారు. ఒక సేవకుడు సమ్సోను చెయ్యి పట్టుకున్నాడు. అతనితో సమ్సోను, “ఈ ఆలయానికి ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచు. వాటిని ఆనుకుని వుంటాను” అన్నాడు. ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడుతున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల మంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారందరూ సమ్సోనును చూసి ఎగతాళి చేస్తున్నారు. అప్పుడు యెహోవాను సమ్సోను స్తుతించాడు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు. అప్పుడు ఆలయం మధ్య వున్న రెండు స్తంభాలను సమ్సోను పట్టుకున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తున్నవి. ఆ రెండు స్తంభాలను అతను కౌగిలించుకున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వైపున వున్నది. మరొకటి ఎడమ చేతివైపున వున్నది. సమ్సోను ఇలా అన్నాడు; “ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తికొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాలకులు మరియు మనుష్యుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటికంటె మరణ సమయంలోనే, చాలా మందిని చంపి వేశాడు. సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.
న్యాయాధిపతులు 16:1-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను. సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను. పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో–నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి. కాబట్టి దెలీలా–నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా సమ్సోను–ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటుననుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా–ఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి– సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములోనుండిరి. అతడు తన చేతులమీదనుండి నూలుపోగునువలె ఆ తాళ్లు తెంపెను. అప్పుడు దెలీలా–ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను. అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను. అప్పుడు ఆమె–నాయందు నీకిష్టము లేనప్పుడు –నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి–నేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి–యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమెయొద్దకు రాగా ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీదియేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను. ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలుతిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు–మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సమ్సో నును చూచినప్పుడు–మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు–మనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభములమధ్యను అతని నిలువబెట్టి పరిహాసముచేయగా సమ్సోను తనచేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను–ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారులందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళిచేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి. అప్పుడు సమ్సోను –యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారులమీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
న్యాయాధిపతులు 16:1-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక రోజు సంసోను గాజాకు వెళ్లి, అక్కడ ఒక వేశ్యను చూసి రాత్రి ఆమెతో గడపడానికి ఆమె దగ్గర ఉండిపోయాడు. “సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు. అయితే సంసోను మధ్యరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు. తర్వాత అతడు లేచి, పట్టణ ద్వారం తలుపులను వాటి అడ్డకర్రలతో సహా ఊడబెరికి తన భుజాల మీద ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా కొండ మీదికి వాటిని మోసుకెళ్లాడు. కొంతకాలం తర్వాత అతడు శోరేకు లోయకు చెందిన దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఫిలిష్తీయుల నాయకులు ఆమె దగ్గరకు వెళ్లి, “మేము అతన్ని కట్టిపడేసి లొంగదీసుకోడానికి నీవు అతన్ని ఆకర్షించుకుని అతని గొప్ప బలం యొక్క రహస్యం ఏమిటో, అతన్ని మేము ఎలా గెలవగలమో తెలుసుకో! అప్పుడు మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి షెకెళ్లు ఇస్తాం” అని అన్నారు. కాబట్టి దెలీలా సంసోనుతో, “నీ గొప్ప బలం యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పవా, నిన్ను కట్టి లోబరుచుకోవడం ఎలా?” అని అడిగింది. అందుకు సంసోను ఆమెతో, “ఎవరైనా నన్ను తడి ఆరని ఏడు పచ్చి క్రొత్త వింటినారలతో కట్టేస్తే, నా బలం పోయి నేను మామూలు మనుష్యుల్లా అవుతాను” అని జవాబిచ్చాడు. అప్పుడు ఫిలిష్తీయుల నాయకులు తడి ఆరని ఏడు పచ్చి వింటినారలు ఆమె తెచ్చి ఇవ్వగా, ఆమె వాటితో అతన్ని కట్టేసింది. లోపలి గదిలో మనుష్యులు దాక్కొని ఉన్నప్పుడు అతనితో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని ఆమె అతనితో అనగా అతడు నూలు పోగును మంట దగ్గర పెడితే తెగిపోయినట్లు ఆ వింటినారలను తెంపేశాడు. కాబట్టి అతని బలం యొక్క రహస్యం వెల్లడి కాలేదు. అప్పుడు దెలీలా సంసోనుతో, “నీవు నన్ను మోసం చేశావు; నాకు అబద్ధం చెప్పావు. సరే ఇప్పుడైనా నిజం చెప్పు” అని అన్నది. అప్పుడు సంసోను, “ఎవరైనా నన్ను ఎప్పుడు వాడని క్రొత్త త్రాళ్లతో కట్టేస్తే, నేను ఇతర మనుష్యుల్లా బలహీనమవుతాను” అని జవాబిచ్చాడు. కాబట్టి దెలీలా క్రొత్త త్రాళ్లు తెచ్చి వాటితో అతన్ని కట్టేసి గదిలో మనుష్యులతో దాక్కొని ఉండగా, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని చెప్పింది. అయితే అతడు త్రాళ్లను నూలుపోగుల వలె తెంపేశాడు. అప్పుడు దెలీలా సంసోనుతో, “అప్పుడు దెలీలా సంసోనుతో, ఈసారి కూడా నీవు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. నిన్ను ఎలా బంధించవచ్చో చెప్పు” అని అన్నది. అతడు జవాబిస్తూ, “బహుశ నా జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లితే వాటిని అనపసూదితో కట్టేస్తే నేను అందరు మనుష్యుల్లా బలహీనుడను అయిపోతాను” అని అన్నాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు దెలీలా అతని జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లి, మేకు పెట్టి బిగించింది. అప్పుడు సంసోనుతో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అనగానే అతడు నిద్ర మేల్కొని అనపసూదిని మగ్గాన్ని లాగివేశాడు. అప్పుడు ఆమె, “నామీద నమ్మకం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? నీ గొప్ప బలం యొక్క రహస్యం నాకు చెప్పకుండా నన్ను మోసం చేయడం ఇది మూడవసారి” అని అన్నది. ఇలా ఆమె ప్రతిరోజు అతన్ని వేధించడంతో అతడు చస్తే బాగుండేది అనుకున్నాడు. అతడు ఆమెకు మొత్తం చెప్పేశాడు, “నేను పుట్టినప్పటి నుండి దేవునికి నాజీరుగా ప్రతిష్ఠించబడ్డాను. నా తలమీద ఇంతవరకు ఎన్నడు మంగల కత్తి పడలేదు. నా తలవెంట్రుకలు పూర్తిగా తీసివేస్తే నా బలం తొలగిపోయి నేను అందరు మనుష్యుల్లా బలహీనమవుతాను” అని చెప్పాడు. అతడు తనకు మొత్తం చెప్పాడని దెలీలా గ్రహించి, ఫిలిష్తీ నాయకులకు, “మరోసారి మీరు రండి; అతడు నాకు మొత్తం చెప్పాడు” అని కబురు పంపింది. కాబట్టి ఫిలిష్తీయుల నాయకులు తమతో వెండిని తీసుకువచ్చారు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒకని పిలిపించి, సంసోను ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అతని బలం అతన్ని విడిచిపోయింది. అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది. అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు. తర్వాత ఫిలిష్తీయులు అతన్ని బంధించి కళ్లు ఊడదీసి గాజాకు తీసుకెళ్లారు. అతన్ని ఇత్తడి గొలుసులతో బంధించి చెరసాలలో ధాన్యం విసరడానికి పెట్టారు. అయితే క్షౌరం చేయబడిన అతని తలమీద వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి. ఫిలిష్తీయుల నాయకులు, “మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు” అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు. ఆ ప్రజలు అతన్ని చూసి, “మన దేవుడు మన శత్రువును మన చేతులకు అప్పగించాడు, మన దేశాన్ని పాడు చేసినవాన్ని, మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు” తమ దేవున్ని పొగిడారు, వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, “మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!” అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు. వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు, తన చేయి పట్టుకున్న దాసునితో సంసోను, “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేను వాటిని ఆనుకుని నిలబడతాను” అని అడిగాడు. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఫిలిష్తీయుల నాయకులందరు అక్కడే ఉన్నారు, సంసోను చేస్తున్న వినోదాన్ని గుడి కప్పు మీది నుండి దాదాపు మూడువేలమంది స్త్రీ పురుషులు చూస్తున్నారు. అప్పుడు సంసోను, “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను” అని ప్రార్థన చేశాడు. తర్వాత సంసోను గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో కుడిచేతితో ఒకదాన్ని ఎడమచేతితో ఒకదాన్ని పట్టుకుని, సంసోను, “నేను నాతోపాటు ఫిలిష్తీయులు కలిసి చస్తాం” అంటూ బలంగా ముందుకు వంగాడు! అంతే ఆ గుడి దానిలో ఉన్న అధికారులు ప్రజలు అందరి మీదా కూలి, అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపాడు. అప్పుడు అతని సోదరులు, తండ్రి ఇంటివారందరు అతన్ని మోసికొనివచ్చి అతన్ని జోరహుకును ఎష్తాయోలుకును మధ్యలో ఉన్న అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇశ్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు.