న్యాయాధిపతులు 16:1-3
న్యాయాధిపతులు 16:1-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత సంసోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూసి ఆమెతో ఉండిపోయాడు. సంసోను అక్కడికి వచ్చాడని గాజా వారికి తెలిసింది. దాంతో వారు రహస్యంగా ఆ స్థలాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన తరువాత సంసోనును చంపాలని కాచుకుని ఉన్నారు. సంసోను అర్థ రాత్రి వరకూ పండుకున్నాడు. అర్థ రాత్రి వేళ ఆ పట్టణం ద్వారం తలుపులను వాటి రెండు దర్వాజాలనూ అడ్డకర్రలతో సహా ఊడబెరికి వాటిని మోసుకుంటూ హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండశిఖరానికి వాటిని తీసుకు వెళ్ళాడు.
న్యాయాధిపతులు 16:1-3 పవిత్ర బైబిల్ (TERV)
ఒకనాడు సమ్సోను గాజా నగరానికి వెళ్లాడు. అక్కడ అతనొక వ్యభిచారిణిని చూశాడు. ఆ రాత్రి ఆమెతో గడిపేందుకు అతను అక్కడికి వెళ్లాడు. ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్పాడు: “సమ్సోను ఇక్కడికి వచ్చాడు.” సమ్సోనును చంపాలని వారనుకున్నారు. అందువల్ల వారు నగరాన్ని చుట్టు ముట్టారు. వారు నగర ద్వారం వద్ద దాగివున్నారు. ఆ రాత్రి అంతా సమ్సోను కోసం చాలా వేచివున్నారు. నిశ్శబ్దంగా వారు ఒకరితో ఒకరు, “ప్రొద్దు పొడవగానే, మనం సమ్సోనును చంపుదాము” అని చెప్పుకున్నారు. కాని సమ్సోను ఆ వ్యభిచారిణితో అర్థరాత్రి వరకే ఉన్నాడు. అర్థరాత్రి వేళ సమ్సోను లేచాడు. నగర ద్వారం తలుపుల్ని అతను లాగివేశాడు. గోడనుండి వాటిని సడలింపజేశాడు. సమ్సోను తలుపులను క్రిందికి లాగివేశాడు. రెండు స్తంభాలను, తలుపుల్ని మూసివేసి ఉంచిన అడ్డగడియలను లాగివేశాడు. సమ్సోను, వాటిని తన భుజాల మీద వేసుకుని, హెబ్రోను నగరానికి సమీపాన ఉన్న కొండ మీదికి మోసుకుని పోయాడు.
న్యాయాధిపతులు 16:1-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను. సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను.
న్యాయాధిపతులు 16:1-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక రోజు సంసోను గాజాకు వెళ్లి, అక్కడ ఒక వేశ్యను చూసి రాత్రి ఆమెతో గడపడానికి ఆమె దగ్గర ఉండిపోయాడు. “సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు. అయితే సంసోను మధ్యరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు. తర్వాత అతడు లేచి, పట్టణ ద్వారం తలుపులను వాటి అడ్డకర్రలతో సహా ఊడబెరికి తన భుజాల మీద ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా కొండ మీదికి వాటిని మోసుకెళ్లాడు.