యాకోబు 5:7-11
యాకోబు 5:7-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడువరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.
యాకోబు 5:7-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమిపై విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు. మీరు కూడా ఓపిక కలిగివుండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి. సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు! సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు, ప్రభువు ఎంత జాలిని దయను కలిగినవాడో ఆయన ఉద్దేశాలలో మీరు తెలుసుకున్నారు.
యాకోబు 5:7-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి. సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు. నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి. చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.
యాకోబు 5:7-11 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు. సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
యాకోబు 5:7-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమి నుండి విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు. మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి. సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు! సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు. చివరకు ప్రభువు అతనికి చేసిన దాన్ని చూసి ప్రభువు ఎంతో జాలి దయ గలవారని మీరు తెలుసుకున్నారు.