యెషయా 7:1-17

యెషయా 7:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యూదా రాజైన ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు అయిన ఆహాజు దినాల్లో సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడు అయిన పెకహు యెరూషలేముపై దండెత్తారు. అది వారివల్ల కాలేదు. అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి. అతనితో చెప్పు “భద్రం. కంగారు పడకు. పొగ లేస్తున్న ఈ రెండు కాగడాలకు అంటే రెజీను, సిరియా వాళ్ళు, రెమల్యా కొడుకు పెకహు-వీళ్ళ కోపాగ్నికి జడిసి పోకు. బెదిరిపోకు. సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కొడుకు నీకు కీడు చేయాలని ఆలోచించారు. ‘మనం యూదా దేశం మీదికి పోయి దాని ప్రజలను భయపెట్టి దాని ప్రాకారాలు పడగొట్టి టాబెయేలు కొడుకును దానిపై రాజుగా చేద్దాం రండి’ అని చెప్పుకున్నారు.” అయితే ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “ఆ మాట నిలవదు, అది జరగదు. సిరియాకు రాజధాని దమస్కు. దమస్కుకు రాజు రెజీను. అరవై ఐదు సంవత్సరాల లోపు ఎఫ్రాయిము ఒక జాతిగా ఉండకుండా నాశనమై పోతుంది. షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని. షోమ్రోనుకు రాజు రెమల్యా కొడుకు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండక పోతే భద్రంగా ఉండరు.” యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు. “నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే.” కానీ ఆహాజు “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు. కాబట్టి యెషయా ఇలా జవాబిచ్చాడు. “దావీదు వంశస్థులారా, వినండి. మనుషులను విసికించడం చాలదన్నట్టు నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది. కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, తేనె తింటాడు. కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి రాక ముందే ఎవరిని చూసి నువ్వు హడలి పోతున్నావో ఆ ఇద్దరు రాజుల దేశం నాశనమై పోతుంది. యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.

షేర్ చేయి
Read యెషయా 7

యెషయా 7:1-17 పవిత్ర బైబిల్ (TERV)

ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు. దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు. అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది. “ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు. వారు మీకు విరోధంగా పథకాలు వేశారు. మనం వెళ్లి యూదా మీద యుద్ధం చేయాలి. యూదాను మనలో మనం పంచుకొందాం. టాబెయేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” అని వారన్నారు. నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి పథకం పనిచేయదు. అది సంభవించదు. రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు. ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.” అప్పుడు యెహోవా ఆహాజుతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.” కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు. అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. కాబట్టి ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమారుడ్ని కని, ఆయన్ని ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది. అతను పెరుగు, తేనె తినును చెడును విసర్జించి మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా జీవిస్తాడు. కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయిపోతాయి. మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు. “కానీ మీరు యెహోవాను గూర్చి భయపడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్టకాలాలను తీసుకొని వస్తాడు. మీ ప్రజలకు, మీ తండ్రివంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? మీ మీద యుద్ధం చేయటానికి అష్షూరు రాజును యెహోవా తీసుకొని వస్తాడు.

షేర్ చేయి
Read యెషయా 7

యెషయా 7:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను అప్పుడు–సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఈలాగు సెలవిచ్చెను–ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువకడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము –భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము. సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండ నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని; షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండినయెడల స్థిరపడక యుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను– నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే. ఆహాజు–నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు–ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా? కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాకమునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమదినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటివరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.

షేర్ చేయి
Read యెషయా 7

యెషయా 7:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు. అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి. అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు. అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని, “మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ” అయితే ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “అది నిలబడదు, అలా జరుగదు. ఎందుకంటే అరాము రాజధాని దమస్కు. దమస్కు రాజు రెజీను మాత్రమే. అరవై అయిదు సంవత్సరాలు కాకముందే ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది. ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.” యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ, “నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు. అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు. అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా? కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. తప్పును తిరస్కరించి, సరియైనది ఎంచుకోవడం తెలిసినప్పుడు అతడు పెరుగు, తేనె తింటాడు. ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి. యెహోవా నీ మీదికి, నీ ప్రజలమీదికి, నీ తండ్రి ఇంటి మీదికి, ఎఫ్రాయిం యూదా నుండి విడిపోయిన రోజు నుండి ఇప్పటివరకు రాని రోజులను రప్పిస్తారు. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పిస్తారు” అని అన్నాడు.

షేర్ చేయి
Read యెషయా 7