యూదా రాజైన ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు అయిన ఆహాజు దినాల్లో సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడు అయిన పెకహు యెరూషలేముపై దండెత్తారు. అది వారివల్ల కాలేదు. అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి. అతనితో చెప్పు “భద్రం. కంగారు పడకు. పొగ లేస్తున్న ఈ రెండు కాగడాలకు అంటే రెజీను, సిరియా వాళ్ళు, రెమల్యా కొడుకు పెకహు-వీళ్ళ కోపాగ్నికి జడిసి పోకు. బెదిరిపోకు. సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కొడుకు నీకు కీడు చేయాలని ఆలోచించారు. ‘మనం యూదా దేశం మీదికి పోయి దాని ప్రజలను భయపెట్టి దాని ప్రాకారాలు పడగొట్టి టాబెయేలు కొడుకును దానిపై రాజుగా చేద్దాం రండి’ అని చెప్పుకున్నారు.” అయితే ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “ఆ మాట నిలవదు, అది జరగదు. సిరియాకు రాజధాని దమస్కు. దమస్కుకు రాజు రెజీను. అరవై ఐదు సంవత్సరాల లోపు ఎఫ్రాయిము ఒక జాతిగా ఉండకుండా నాశనమై పోతుంది. షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని. షోమ్రోనుకు రాజు రెమల్యా కొడుకు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండక పోతే భద్రంగా ఉండరు.” యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు. “నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే.” కానీ ఆహాజు “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు. కాబట్టి యెషయా ఇలా జవాబిచ్చాడు. “దావీదు వంశస్థులారా, వినండి. మనుషులను విసికించడం చాలదన్నట్టు నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది. కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, తేనె తింటాడు. కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి రాక ముందే ఎవరిని చూసి నువ్వు హడలి పోతున్నావో ఆ ఇద్దరు రాజుల దేశం నాశనమై పోతుంది. యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.
Read యెషయా 7
వినండి యెషయా 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 7:1-17
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు