యెషయా 55:1-9

యెషయా 55:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దాహంతో ఉన్నవారలారా, నీళ్ల దగ్గరకు రండి. డబ్బులేని వారలారా, మీరు వచ్చి కొని తినండి! డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా, ద్రాక్షరసం, పాలు కొనండి. ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు. శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను. చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను, జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను. ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. యెహోవా నిన్ను మహిమపరచడం చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి. దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు. “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు” అని యెహోవా చెప్తున్నారు. “ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గాల కన్నా నా మార్గాలు మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.

యెషయా 55:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి. రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి. తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు? నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి. శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను. ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.” నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి. వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు. “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు. “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

యెషయా 55:1-9 పవిత్ర బైబిల్ (TERV)

“దాహంతో ఉన్న ప్రజలారా మీరంతా వచ్చి నీళ్లు త్రాగండి! మీ వద్ద డబ్బు లేకపోతే చింతపడకండి. రండి, మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, త్రాగండి! మీకు డబ్బు అవసరం లేదు. మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, త్రాగండి. ఆహారం, ద్రాక్షారసం ఉచితం! నిజంగా ఆహారం కానిదానికోసం మీ ధనం వ్యర్థం చేయటం ఎందుకు? మిమ్మల్ని నిజంగా సంతృప్తి పరచని దానికోసం మీరు ప్రయాసపడటం ఎందుకు? నా మాట జాగ్రత్తగా వినండి, అప్పుడు మీరు మంచి ఆహారం భోజనం చేస్తారు. మీ ఆత్మను తృప్తిపరచే ఆహారం మీరు భోజనం చేస్తారు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, మీ ఆత్మలు జీవించునట్లుగా మీరు నా మాట వినండి. నా వద్దకు రండి! శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక నేను మీతో చేస్తాను. అది నేను దావీదుతో చేసిన ఒడంబడికలా ఉంటుంది. దావీదు ఎడల శాశ్వతంగా దయగలిగి ఉంటానని నేను అతనికి వాగ్దానం చేసాను. మరి మీరు ఆ వాగ్దానాన్ని నమ్ముకోవచ్చు. రాజ్యాలన్నింటిలో నా శక్తికి దావీదును సాక్షిగా నేను చేశాను. దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకునిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి వాగ్దానం చేశాను.” నీవు యెరుగని స్థలాల్లో రాజ్యాలు ఉన్నాయి, కానీ ఆ రాజ్యాలను నీవు పిలుస్తావు. ఆ రాజ్యాలకు నీవు తెలియదు. కానీ అవి నీ దగ్గరకు పరుగెడతాయి. నీ దేవుడు యెహోవా ఇలా కోరుతున్నాడు కనుక ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు నిన్ను గౌరవిస్తున్నాడు. కనుక ఇది జరుగుతుంది. కనుక సమయం మించిపోక ముందే నీవు యెహోవా కోసం వెదకాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఇప్పుడే నీవు ఆయనను వేడుకోవాలి. దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టాలి. వారు తమ దురాలోచనలు నిలిపివేయాలి. వారు తిరిగి యెహోవా దగ్గరకు రావాలి. అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు. మన దేవుడు క్షమిస్తాడు గనుక ఆ మనుష్యులు యెహోవా దగ్గరకు రావాలి. యెహోవా చెబుతున్నాడు, “మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీ మార్గాలు నా మార్గాలవంటివి కావు. ఆకాశాలు భూమికంటె ఉన్నతంగా ఉన్నాయి. అదే విధంగా మీ మార్గాలకంటె నా మార్గాలు ఉన్నతంగా ఉన్నాయి. మరియు మీ తలంపులకంటె నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి.” యెహోవా తానే ఈ సంగతులు చెప్పాడు.

యెషయా 55:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

యెషయా 55:1-9

యెషయా 55:1-9 TELUBSIయెషయా 55:1-9 TELUBSI