హెబ్రీయులకు 7:1-10

హెబ్రీయులకు 7:1-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు మరియు అత్యున్నతమైన దేవునికి యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కిసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు. అబ్రాహాము ప్రతీ దానిలో పదో భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కిసెదెకు అనగా మొదట “నీతికి రాజు అని అర్థం” అటు తరువాత “షాలేము రాజు” అనగా “శాంతికి రాజు” అని అర్థం తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు. ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు! లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. ఈ మనుష్యుడు లేవీ సంతతి వాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకొని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. తక్కువవాడు ఎక్కువవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది. దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు, ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు.

హెబ్రీయులకు 7:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రాహామును షాలేం పట్టణానికి రాజైన మెల్కీసెదెకు కలుసుకుని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను యుద్ధంలో పట్టుకున్న వాటిలో పదవ వంతు అతనికి ఇచ్చాడు. “మెల్కీసెదెకు” అనే అతని పేరుకు నీతికి రాజు అనీ, ఇంకా, “షాలేం రాజు”, అంటే శాంతికి రాజు అనీ అర్థం. అతడు తండ్రి లేకుండానూ, తల్లి లేకుండానూ ఉన్నాడు. ఇతనికి పూర్వీకులంటూ ఎవరూ లేరు. ఇతని జీవిత కాలానికి ప్రారంభం లేదు. జీవితానికి అంతం అంటూ లేదు. దేవుని కుమారుడిలా ఇతడు కలకాలం యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వస్తువుల్లో పదోవంతు ఇతనికి ఇచ్చాడు. లేవి వంశం వారిలో నుండి యాజకులైన వారు, ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర పదవ వంతును కానుకగా సేకరించాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. కానీ లేవీతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం. లేవీ క్రమంలో యాజకుడై కానుక స్వీకరించేవాడు ఒకరోజు మరణిస్తాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా వివరణ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పదోవంతు కానుకలను స్వీకరించిన లేవీ తాను కూడా అబ్రాహాము ద్వారా పదవ వంతు కానుకలు ఇచ్చాడు. ఇది ఎలాగంటే, లేవీ అబ్రాహాము నుండే రావాలి కాబట్టి, అబ్రాహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవీ ఉన్నాడు.

హెబ్రీయులకు 7:1-10 పవిత్ర బైబిల్ (TERV)

ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు. మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు. మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.

హెబ్రీయులకు 7:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రా హామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రా హాము అతనికి కొల్లగొన్న శ్రేప్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమాళ్లలోనుండి యాజ కత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చు కొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రా హామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను.

హెబ్రీయులకు 7:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు. అబ్రాహాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనగా మొదట, “నీతికి రాజు అని అర్థం” అటు తర్వాత “షాలేము రాజు” అనగా, “శాంతికి రాజు” అని అర్థం తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు. ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు! లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది. దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు, ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు.