హెబ్రీ పత్రిక 7:1-10

హెబ్రీ పత్రిక 7:1-10 OTSA

ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు. అబ్రాహాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనగా మొదట, “నీతికి రాజు అని అర్థం” అటు తర్వాత “షాలేము రాజు” అనగా, “శాంతికి రాజు” అని అర్థం తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు. ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు! లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది. దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు, ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు.