హెబ్రీయులకు 11:23-40
హెబ్రీయులకు 11:23-40 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తరువాత మూడు నెలల వరకు దాచివుంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు. విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు. అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించడంకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకొన్నాడు. క్రీస్తు కొరకైన అవమానాన్ని ఐగుప్తు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఐగుప్తును విడిచి వెళ్ళాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు. అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు. విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్ళారు; అయితే ఐగుప్తువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్ళడానికి ప్రయత్నించి, మునిగిపోయారు. విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి. విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కనుక అవిధేయులతో పాటు చంపబడకుండా రక్షించబడింది. ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు. వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు, తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకొన్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాల్లో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు. కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు. వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకొని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు. ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు. వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు, ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మనకొరకు మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.
హెబ్రీయులకు 11:23-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు. విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు. కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు. ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు. విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు. విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు. విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది. విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి. విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు. ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు. విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు. స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు. ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు. వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు. అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.
హెబ్రీయులకు 11:23-40 పవిత్ర బైబిల్ (TERV)
మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు. మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు. మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు. దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు. ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి. దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువ పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవిశ్వాసులతోసహా ఆమె మరణించలేదు. ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు. భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు. వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు. దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.
హెబ్రీయులకు 11:23-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృిష్టి యుంచెను. విశ్వాసమునుబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచి పోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగి పోయిరి. విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి; నీతికార్యములను జరిగించిరి; వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్లను మూసిరి; అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేప్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొంద నొల్లక యాతనపెట్టబడిరి. మరికొందరు తిరస్కారము లను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభ వించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయ బడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమ పడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనములేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేప్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.
హెబ్రీయులకు 11:23-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తర్వాత మూడు నెలల వరకు దాచి ఉంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు. విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు. అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించేకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకున్నాడు. క్రీస్తు కొరకైన అవమానాన్ని ఈజిప్టు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఈజిప్టును విడిచి వెళ్లాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు. అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు. విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్లారు; అయితే ఈజిప్టువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్లడానికి ప్రయత్నించి, మునిగిపోయారు. విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి. విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కాబట్టి అవిధేయులతో పాటు చంపబడకుండా రక్షించబడింది. ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు. వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు, తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకున్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాలలో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు. కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు. కొందరు ఎగతాళిచేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు. వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకుని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు. ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు. వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు, ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మన కోసం మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.