విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తరువాత మూడు నెలల వరకు దాచివుంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు.
విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు. అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించడంకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకొన్నాడు. క్రీస్తు కొరకైన అవమానాన్ని ఐగుప్తు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కొరకు ఎదురు చూస్తున్నాడు. విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఐగుప్తును విడిచి వెళ్ళాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు. అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు.
విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్ళారు; అయితే ఐగుప్తువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్ళడానికి ప్రయత్నించి, మునిగిపోయారు.
విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.
విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కనుక అవిధేయులతో పాటు చంపబడకుండా రక్షించబడింది.
ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు. వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు, తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకొన్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాల్లో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు. కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు. వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకొని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు. ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు.
వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు, ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మనకొరకు మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.