ఆదికాండము 47:1-27
ఆదికాండము 47:1-27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యోసేపు వెళ్లి ఫరోను చూచి–నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి–మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు–నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు–కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి–నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు. ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింప వచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచినయెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో– నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు యాకోబు–నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరోయెదుటనుండి వెళ్లిపోయెను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చినవారికి ధాన్య మమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్య మంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి–మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు–మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయినయెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనివచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమునవారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు. నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములనుకొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరోకొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమతమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను. అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు–ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి. పంటలో అయిదవభాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా వారు–నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. అప్పుడు అయిదవభాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములనుగూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతా నాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.
ఆదికాండము 47:1-27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోసేపు వెళ్ళి ఫరోతో “మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు” అని తెలియచేసి, తన సోదరుల్లో ఐదు గురిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు. ఫరో, అతని సోదరులను చూసి “మీ వృత్తి ఏంటి?” అని అడిగితే వారు “నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం” అని ఫరోతో చెప్పారు. వారు “కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి” అని ఫరోతో అన్నారు. ఫరో యోసేపును చూసి “మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు. ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు” అని చెప్పాడు. యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు. ఫరో “నీ వయసెంత?” అని యాకోబును అడిగాడు. యాకోబు “నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు” అని ఫరోతో చెప్పి, ఫరోను దీవించి వెళ్ళిపోయాడు. ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు. యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు. కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి. యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు. ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి “మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అన్నారు. అందుకు యోసేపు “మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను” అని చెప్పాడు. కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు. ఆ సంవత్సరం గడిచాక, తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు. మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి” అని అడిగారు. ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది. అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను దాసులుగా చేశాడు. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు “ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి. నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు. వారు “నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉండుగాక. మేము ఫరోకు బానిసలమవుతాం” అని చెప్పారు. అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకూ నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు.
ఆదికాండము 47:1-27 పవిత్ర బైబిల్ (TERV)
యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు. యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు. “మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు. ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు. “కనాను దేశంలో కరవు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవసరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బ్రతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు. అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులను కూడ చూసుకోవచ్చు.” అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు. “నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బ్రతికాను. 130 సంవత్సరాలే నేను బ్రతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బ్రతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు. యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టలో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్ఠమైంది. మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు. కరవు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దేశాలు చాలా పేదవయ్యాయి. ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ఆ ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు. కొన్నాళ్లకు ఈజిప్టులోను, కనానులోను ప్రజల దగ్గర పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తాం” అని చెప్పారు. “మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు. కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి పశువులను తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించటానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. మా పశువులన్నీ ఇప్పుడు మీవే. మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి లేవు. మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిసలంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బ్రతుకుతాం. భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుంది” అని చెప్పారు. కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేశారు. వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేశారు. మరియు ప్రజలందరు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు. యాజకుల స్వంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకొనేవారు. యోసేపు ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో నాట్లు వేయవచ్చును. కోతకాలంలో మీ పంటలో అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయిదింట నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను పోషించుకోవచ్చు.” ప్రజలు, “మీరు మా ప్రాణాలు రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు బానిసలంగా ఉంటాం” అన్నారు. కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేశాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం. భూములన్నీ ఫరో స్వంతం. యాజకుల భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు. ఇశ్రాయేలు (యాకోబు) ఈజిప్టులో ఉన్నాడు. గోషెను దేశంలో అతడు నివసించాడు. అతని కుటుంబం పెరిగి చాలా పెద్దది అయింది. ఈజిప్టులో వారు ఆ భూమిని సంపాదించి వర్ధిల్లారు.
ఆదికాండము 47:1-27 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యోసేపు వెళ్లి ఫరోతో, “నా తండ్రి, నా సోదరులు కనాను దేశం నుండి వారి గొర్రెల మందలు, పశువులు, వారి సమస్తంతో వచ్చారు, ఇప్పుడు గోషేనులో ఉన్నారు” అన్నాడు. అతడు తన సోదరులలో అయిదుగురిని ఫరోకు ఎదుట కనుపరిచాడు. ఫరో ఆ సోదరులతో, “మీ వృత్తి ఏంటి?” అని అడిగాడు. “మీ దాసులు మా పూర్వికుల్లా గొర్రెల కాపరులు” అని వారు ఫరోకు జవాబిచ్చారు. వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు. ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు, ఈజిప్టు దేశమంతా నీ ముందుంది; శ్రేష్ఠమైన ప్రాంతంలో నీ తండ్రిని, నీ సోదరులను ఉంచు. గోషేనులో వారు నివసించవచ్చు. వీరిలో ప్రత్యేక సామర్థ్యం కలిగినవారు ఎవరైనా ఉంటే, నా సొంత పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు” అన్నాడు. తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును తీసుకువచ్చి ఫరో ఎదుట కనుపరిచాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత, ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు. యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు. తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. యోసేపు తన తండ్రికి, తన సోదరులకు, తన తండ్రి ఇంటివారికందరికి వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారాన్ని కూడా అందించాడు. అయితే దేశమంతటిలో ఆహారం లేదు ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది; ఈజిప్టు కనాను దేశాలు కరువును బట్టి ఆకలితో అలమటించాయి. యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు. ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు. అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు. కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు. సంవత్సరం ముగిసిన తర్వాత, మరుసటి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి, “మేము మా ప్రభువు నుండి నిజాన్ని దాచలేము, మా డబ్బు అయిపోయింది, మా పశువులు మీకే ఇచ్చాం, ఇక మా శరీరాలు, మా భూమి తప్ప మా ప్రభువుకు ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు. మేము, మా భూమి మీ కళ్లముందే నశించడం బాగుంటుందా? ఆహారం కోసం మమ్మల్ని, మా భూములను కొనండి. మేము మా భూములతో సహా ఫరోకు బానిసలమవుతాము. మేము చావకుండ బ్రతికేలా పొలాలు పాడైపోకుండ మాకు విత్తనాలు ఇవ్వండి” అని మనవి చేసుకున్నారు. కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది, యోసేపు ఈజిప్టు యొక్క సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దు వరకు ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేశాడు. అయితే, యాజకులకు చెందిన భూమిని మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే వారు క్రమంగా ఫరో నుండి బత్తెం పొందుకునే వారు, ఆ బత్తెంతో వారికి సరిపడే ఆహారం ఉంది. కాబట్టి వారు తమ భూమిని అమ్మలేదు. యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి. అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు. అప్పుడు వారు, “మీరు మా జీవితాలను కాపాడారు. ప్రభువా, మామీద మీ దయ ఉంచండి; మేము ఫరోకు బానిసలుగా ఉంటాం” అని అన్నారు. కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో గోషేను ప్రదేశంలో స్థిరపడ్డారు. అక్కడ స్వాస్థ్యం సంపాదించుకుని ఫలించి, సంతానాభివృద్ధి చెందుతూ వేగంగా విస్తరించారు.