ఆదికాండము 47
47
1యోసేపు వెళ్లి ఫరోను చూచి–నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి 2తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. 3ఫరో అతని సహోదరులను చూచి–మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు–నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి. 4మరియు వారు–కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా 5ఫరో యోసేపును చూచి–నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు. 6ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింప వచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచినయెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను 7మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. 8ఫరో– నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు 9యాకోబు–నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి 10ఫరోను దీవించి ఫరోయెదుటనుండి వెళ్లిపోయెను. 11ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను. 12మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.
13కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. 14వచ్చినవారికి ధాన్య మమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్య మంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. 15ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి–మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. 16అందుకు యోసేపు–మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయినయెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనివచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను. 17ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. 18ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమునవారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు. 19నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములనుకొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. 20అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరోకొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమతమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను. 21అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. 22యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు.
23యోసేపు–ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి. 24పంటలో అయిదవభాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా 25వారు–నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. 26అప్పుడు అయిదవభాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములనుగూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు. 27ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతా నాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.
28యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు. 29ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించి నప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి–నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. 30నా పితరులతోకూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. 31అందుకతడు–నేను నీ మాటచొప్పున చేసెదననెను. మరియు అతడు–నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆదికాండము 47: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.