ఆదికాండము 39:1-12

ఆదికాండము 39:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు. యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు. యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు. అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది. అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు. ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది. అయితే అతడు తిరస్కరించి “నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు. ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు. అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 39

ఆదికాండము 39:1-12 పవిత్ర బైబిల్ (TERV)

యోసేపును కొన్న వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు. అయితే యెహోవా యోసేపుకు సహాయం చేశాడు గనుక యోసేపు విజయవంతుడు అయ్యాడు. తన యజమాని, ఈజిప్టు వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్లు పోతీఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్లు పోతీఫరు గ్రహించాడు. అందుచేత యోసేపు విషయంలో పోతీఫరు చాల సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద యోసేపు అధికారి. ఆ ఇంటిమీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత, యెహోవా ఆ ఇంటినీ, పోతీఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపునుబట్టే యెహోవా చేశాడు. పోతీఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు. కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి దేనిగూర్చీ చింతించలేదు. యోసేపు చాలా అందగాడు. చూడ చక్కనివాడు. కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, “నాతో శయనించు” అని అతనితో అంది. కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు. నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు. అది దేవునికి వ్యతిరేకంగా పాపం.” ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు. ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. ఆ తొందరలో అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేశాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 39

ఆదికాండము 39:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతనిచేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను. అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి–తనతో శయ నించుమని చెప్పెను అయితే అతడు ఒప్పక–నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెనుగాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుట కైనను ఆమె మాట విన్నవాడుకాడు. అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

షేర్ చేయి
Read ఆదికాండము 39

ఆదికాండము 39:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యోసేపు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరు అనే ఈజిప్టువాడు యోసేపును తీసుకెళ్లిన ఇష్మాయేలీయుల దగ్గర అతన్ని కొన్నాడు. యెహోవా యోసేపుతో ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లాడు, తన ఈజిప్టు యజమాని ఇంట్లో ఉన్నాడు. యెహోవా అతనితో ఉన్నారని, అతడు చేసే ప్రతి పనిలో యెహోవా విజయం ఇచ్చారని అతని యజమాని చూసినప్పుడు యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు, అతనికి వ్యక్తిగత పరిచారకుడయ్యాడు. పోతీఫరు యోసేపును అతని ఇంటికి అధికారిగా నియమించి తనకున్న సమస్తాన్ని అతని పర్యవేక్షణలో పెట్టాడు. తన ఇంటికి, తన సమస్తానికి యోసేపును అధికారిగా నియమించినప్పటి నుండి, యెహోవా ఈజిప్టు యజమాని ఇంటిని ఆశీర్వదించారు. ఇంట్లోనూ, పొలంలోనూ పోతీఫరుకు ఉన్న సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉంది. కాబట్టి పోతీఫరు సమస్తాన్ని యోసేపు పర్యవేక్షణలో పెట్టాడు; యోసేపు అధికారిగా ఉన్నందుకు తన భోజనం తప్ప మరి దేని గురించి అతడు పట్టించుకోలేదు. యోసేపు మంచి రూపం కలిగినవాడు, అందగాడు. కొంతకాలం తర్వాత తన యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో!” అని అన్నది. కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు. ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు. ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమెతో పడుకోడానికి లేదా ఆమెతో ఉండడానికి కూడా అతడు తిరస్కరించారు. ఒక రోజు అతడు ఇంట్లో తన పనులు చేసుకోవడానికి వెళ్లాడు, అప్పుడు ఇంట్లో పనివారు ఎవరు లేరు. ఆమె అతని అంగీ పట్టుకుని లాగి, “నాతో పడుకో!” అని అన్నది. అయితే అతడు తన అంగీ ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 39