యోసేపును కొన్న వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు. అయితే యెహోవా యోసేపుకు సహాయం చేశాడు గనుక యోసేపు విజయవంతుడు అయ్యాడు. తన యజమాని, ఈజిప్టు వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్లు పోతీఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్లు పోతీఫరు గ్రహించాడు. అందుచేత యోసేపు విషయంలో పోతీఫరు చాల సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద యోసేపు అధికారి. ఆ ఇంటిమీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత, యెహోవా ఆ ఇంటినీ, పోతీఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపునుబట్టే యెహోవా చేశాడు. పోతీఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు. కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి దేనిగూర్చీ చింతించలేదు. యోసేపు చాలా అందగాడు. చూడ చక్కనివాడు. కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, “నాతో శయనించు” అని అతనితో అంది. కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు. నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు. అది దేవునికి వ్యతిరేకంగా పాపం.” ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు. ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. ఆ తొందరలో అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేశాడు.
చదువండి ఆదికాండము 39
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 39:1-12
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు