ఆదికాండము 32:1-11
ఆదికాండము 32:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి–ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన యీము అను పేరు పెట్టెను. యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి–మీరు నా ప్రభువైన ఏశావుతో –ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని; నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికాజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి–మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి; అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి –ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు–నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, –నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
ఆదికాండము 32:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు. యాకోబు వారిని చూసి “ఇది దేవుని సేన” అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి, “మీరు నా ప్రభువైన ఏశావుతో, ‘ఇంతవరకూ నేను లాబాను దగ్గర నివసించాను. నాకు పశువులూ గాడిదలూ మందలూ దాసదాసీజనమూ ఉన్నారు. నీ అనుగ్రహం నాపైనఉండాలని నా ప్రభువుకు తెలపడానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు’ అని చెప్పండి” అని వారికి ఆజ్ఞాపించాడు. ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగివచ్చి “మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాం, అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు” అని చెప్పారు. అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై, “ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకుని పోవచ్చు” అనుకుని, తనతో ఉన్న ప్రజలనూ మందలనూ పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులు చేశాడు. అప్పుడు యాకోబు “నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, ‘నీ దేశానికీ, నీ బంధువుల దగ్గరికీ తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా, నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను. నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లులనూ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను.
ఆదికాండము 32:1-11 పవిత్ర బైబిల్ (TERV)
యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము” అని యాకోబు పేరు పెట్టాడు. యాకోబు అన్న ఏశావు శేయీరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఎదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావు దగ్గరకు వార్తాహరులను పంపాడు. “ఏశావుకు ఇలా చెప్పండి” అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’” వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు. ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు. యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీవు నాకు మేలు చేస్తానన్నావు. నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేశావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను, పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది.
ఆదికాండము 32:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు. యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు. యాకోబు ఎదోము దేశంలోని శేయీరు ప్రాంతంలో ఉన్న తన సోదరుడైన ఏశావు దగ్గరకు తనకంటే ముందు దూతలను పంపాడు. ఆయన వారికి ఇలా సూచించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఇలా చెప్పాలి: ‘మీ సేవకుడైన యాకోబు చెప్తున్నాడు, ఇంతవరకు నేను లాబాను దగ్గరే ఉన్నాను. నాకు మందలు గాడిదలు గొర్రెలు మేకలు, దాసదాసీలు ఉన్నారు. నీ దృష్టిలో దయ పొందడానికి ఇప్పుడు నా ప్రభువుకు ఈ వర్తమానం పంపుతున్నాను.’ ” ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు. ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. “ఒకవేళ ఏశావు ఒక గుంపు మీద దాడి చేస్తే, ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు” అని అతడు అనుకున్నాడు. తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా, మీరు మీ సేవకునికి చూపిన దయ నమ్మకత్వానికి నేను యోగ్యుడను కాను. నేను యొర్దాను దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా అయ్యాను. దేవా, నా సోదరుడు ఏశావు చేతిలో పడకుండ నన్ను తప్పించు, ఎందుకంటే అతడు వచ్చి నన్ను, నా పిల్లలను వారి తల్లులతో పాటు చంపేస్తాడని నాకు భయమేస్తుంది.