యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము” అని యాకోబు పేరు పెట్టాడు. యాకోబు అన్న ఏశావు శేయీరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఎదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావు దగ్గరకు వార్తాహరులను పంపాడు. “ఏశావుకు ఇలా చెప్పండి” అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’” వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు. ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు. యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీవు నాకు మేలు చేస్తానన్నావు. నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేశావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను, పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది.
Read ఆదికాండము 32
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 32:1-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు