ఆదికాండము 28:1-22
ఆదికాండము 28:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇస్సాకు యాకోబును పిలిపించి–నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొను మని యతనికి ఆజ్ఞాపించి –సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను. అతడు పద్దన రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను. ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు–నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞా పించెననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొని నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మాహలతును కూడ పెండ్లి చేసికొనెను. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.
ఆదికాండము 28:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇస్సాకు యాకోబును పిలిపించి “నువ్వు కనాను అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోకూడదు. నువ్వు పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ మేనమామ లాబాను కుమార్తెల్లో ఒకామెను వివాహం చేసుకో సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నువ్వు అనేక జాతులయ్యేలా నీకు సంతానాభివృద్ధి కలిగించి, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసిగా ఉన్న దేశాన్ని, అంటే దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నువ్వు వారసత్వంగా పొందేలా ఆయన నీకూ నీ సంతానానికీ అబ్రాహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు గాక” అని దీవించి పంపివేశాడు. అతడు పద్దనరాములో ఉన్న లాబాను దగ్గరకి ప్రయాణమయ్యాడు. లాబాను సిరియావాడు బెతూయేలు కుమారుడూ యాకోబు, ఏశావుల తల్లి అయిన రిబ్కా సోదరుడూ. ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెళ్ళి చేసుకుని రావడానికి అతణ్ణి అక్కడికి పంపాడనీ అతనిని దీవించినప్పుడు “నువ్వు కనాను దేశపు అమ్మాయిల్లో ఎవరినీ పెళ్ళి చేసుకోవద్దు” అని అతనికి ఆజ్ఞాపించాడనీ ఏశావుకు తెలిసింది. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాడనీ, ఇదిగాక కనాను స్త్రీలు తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదనీ ఏశావు తెలుసుకున్నాడు. అతడు ఇష్మాయేలు దగ్గరికి వెళ్ళి, తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన మహలతును కూడా పెళ్ళి చేసుకున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు. అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు. యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు. అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు. అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.
ఆదికాండము 28:1-22 పవిత్ర బైబిల్ (TERV)
ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు వివాహం చేసుకోగూడదు. కనుక ఈ చోటు విడిచి, పద్దనరాము వెళ్లు. నీ తల్లిరి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లే నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం.” ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించాడు. రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్లాడు. లాబాను, రిబ్కాలకు తండ్రి బెతూయేలు. యాకోబు, ఏశావులకు తల్లి రిబ్కా. తన తండ్రియైన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు భార్యను సంపాదించు కొనేందుకు ఇస్సాకు అతణ్ణి పద్దనరాముకు పంపినట్లు ఏశావుకు తెలిసింది. యాకోబు కనాను స్త్రీని వివాహము చేసుకోగూడదని ఇస్సాకు ఆజ్ఞాపించినట్లు ఏశావుకు తెలిసింది. యాకోబు తన తల్లిదండ్రుల మాటకు విధేయుడై పద్దనరాము వెళ్లినట్లు ఏశావుకు తెలిసింది. తన కుమారులు కనానీ స్త్రీలను వివాహం చేసుకోవటం తండ్రికి ఇష్టం లేదని దీనిద్వారా ఏశావుకు తెలిసింది. అప్పటికే ఏశావుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, మరో స్త్రీని పెళ్లి చేసికొన్నాడు. ఇష్మాయేలు కుమార్తె మాహలతును అతను పెళ్లి చేసుకొన్నాడు. ఇష్మాయేలు అబ్రాహాము కుమారుడు. మాహలతు నెబాయోతు సోదరి. యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటికి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్లు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్లు యాకోబు చూశాడు. అప్పుడు ఆ నిచ్చెన పైన యెహోవా నిలిచినట్లు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి. ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. నేలమీద ధూళి కణముల్లాగ నీకు కూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసింది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.” అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్లు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు. యాకోబు భయపడి, “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను. ఉదయం పెందలాడే యాకోబు లేచి, తాను పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోశాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేశాడు. ఆ స్థలం పేరు లూజు. అయితే యాకోబు దానికి బేతేలు అని పేరు పెట్టాడు. అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేశాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుతూ ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే, నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు. నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.
ఆదికాండము 28:1-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు. వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో. సర్వశక్తిగల దేవుడు నిన్ను దీవించి, నిన్ను ఫలభరితంగా చేసి, జనాంగాల సమాజంగా విస్తరించేలా సంఖ్యాపరంగా వృద్ధి చేయును గాక. ఆయన నీకును, నీ వారసులకు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చును గాక, తద్వార నీవు పరదేశిగా ఉన్న ఈ దేశాన్ని, దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నీవు స్వాధీనం చేసుకుంటావు.” తర్వాత ఇస్సాకు యాకోబును పంపివేశాడు. అతడు పద్దనరాముకు, యాకోబు ఏశావుల తల్లియైన రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు వెళ్లాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కుమారుడు. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాముకు పంపి అక్కడే అతడు భార్యను చూసుకోవాలని, “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు” అని చెప్పాడని, యాకోబు తన తల్లిదండ్రులకు లోబడి పద్దనరాముకు వెళ్లాడని ఏశావు తెలుసుకున్నాడు. అప్పుడు ఏశావు కనాను స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని గ్రహించాడు; కాబట్టి అతడు తనకున్న భార్యలు కాక ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సోదరియైన మహలతును భార్యగా చేసుకున్నాడు. యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. ఒక స్థలం చేరిన తర్వాత సూర్యాస్తమయం అయినందున రాత్రికి అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉన్న రాళ్లలో ఒకటి తీసుకుని, తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. అతడు ఒక కల కన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశాన్ని అంటి ఉంది. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను. నీ సంతానం భూమిపై ఇసుక రేణువుల్లా అవుతారు, నీవు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తావు. భూమిపై ఉన్న సర్వ జనాంగాలు నీ ద్వార, నీ సంతానం ద్వార దీవించబడతారు. నేను నీతో ఉంటాను, నీవు వెళ్లే ప్రతీ చోట నిన్ను సంరక్షిస్తాను, ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నిన్ను విడువను.” యాకోబు నిద్రలేచి, “ఖచ్చితంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నారు, నేను అది గ్రహించలేకపోయాను” అని అనుకున్నాడు. అతడు భయపడి ఇలా అన్నాడు, “ఈ స్థలం ఎంత అద్భుతమైనది! ఇది దేవుని మందిరమే కాని ఇంకొకటి కాదు; ఇది పరలోక ద్వారము.” మర్నాడు తెల్లవారినప్పుడు యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసుకుని, దానిని స్తంభంగా నిలిపి, దాని మీదుగా నూనె పోశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, ముందు ఆ పట్టణం లూజు అని పిలువబడేది. తర్వాత యాకోబు మ్రొక్కుబడి చేస్తూ ఇలా అన్నాడు, “దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ ప్రయాణంలో కాపాడి నాకు తినడానికి ఆహారం ఇచ్చి వేసుకోడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవాయే నా దేవుడుగా ఉంటారు, స్తంభంగా నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరంగా ఉంటుంది. అంతేకాక, నీవు నాకు ఇచ్చే అంతటిలో నుండి నేను నీకు పదవ భాగం ఇస్తాను” అని ఆయనకు మ్రొక్కుబడి చేసుకున్నాడు.