ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు. వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో. సర్వశక్తిగల దేవుడు నిన్ను దీవించి, నిన్ను ఫలభరితంగా చేసి, జనాంగాల సమాజంగా విస్తరించేలా సంఖ్యాపరంగా వృద్ధి చేయును గాక. ఆయన నీకును, నీ వారసులకు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చును గాక, తద్వార నీవు పరదేశిగా ఉన్న ఈ దేశాన్ని, దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నీవు స్వాధీనం చేసుకుంటావు.” తర్వాత ఇస్సాకు యాకోబును పంపివేశాడు. అతడు పద్దనరాముకు, యాకోబు ఏశావుల తల్లియైన రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు వెళ్లాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కుమారుడు.
ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాముకు పంపి అక్కడే అతడు భార్యను చూసుకోవాలని, “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు” అని చెప్పాడని, యాకోబు తన తల్లిదండ్రులకు లోబడి పద్దనరాముకు వెళ్లాడని ఏశావు తెలుసుకున్నాడు. అప్పుడు ఏశావు కనాను స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని గ్రహించాడు; కాబట్టి అతడు తనకున్న భార్యలు కాక ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సోదరియైన మహలతును భార్యగా చేసుకున్నాడు.
యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. ఒక స్థలం చేరిన తర్వాత సూర్యాస్తమయం అయినందున రాత్రికి అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉన్న రాళ్లలో ఒకటి తీసుకుని, తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. అతడు ఒక కల కన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశాన్ని అంటి ఉంది. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను. నీ సంతానం భూమిపై ఇసుక రేణువుల్లా అవుతారు, నీవు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తావు. భూమిపై ఉన్న సర్వ జనాంగాలు నీ ద్వార, నీ సంతానం ద్వార దీవించబడతారు. నేను నీతో ఉంటాను, నీవు వెళ్లే ప్రతీ చోట నిన్ను సంరక్షిస్తాను, ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నిన్ను విడువను.”
యాకోబు నిద్రలేచి, “ఖచ్చితంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నారు, నేను అది గ్రహించలేకపోయాను” అని అనుకున్నాడు. అతడు భయపడి ఇలా అన్నాడు, “ఈ స్థలం ఎంత అద్భుతమైనది! ఇది దేవుని మందిరమే కాని ఇంకొకటి కాదు; ఇది పరలోక ద్వారము.”
మర్నాడు తెల్లవారినప్పుడు యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసుకుని, దానిని స్తంభంగా నిలిపి, దాని మీదుగా నూనె పోశాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, ముందు ఆ పట్టణం లూజు అని పిలువబడేది.
తర్వాత యాకోబు మ్రొక్కుబడి చేస్తూ ఇలా అన్నాడు, “దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ ప్రయాణంలో కాపాడి నాకు తినడానికి ఆహారం ఇచ్చి వేసుకోడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవాయే నా దేవుడుగా ఉంటారు, స్తంభంగా నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరంగా ఉంటుంది. అంతేకాక, నీవు నాకు ఇచ్చే అంతటిలో నుండి నేను నీకు పదవ భాగం ఇస్తాను” అని ఆయనకు మ్రొక్కుబడి చేసుకున్నాడు.