గలతీయులకు 5:7-18
గలతీయులకు 5:7-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు మంచి పరుగు పందాన్ని పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. “పులిసింది కొంచెమే అయినా అది మొత్తం పిండిని పులియజేస్తుంది.” మీరు మరోలా అనుకోరని ప్రభువులో నేను నమ్మకం కలిగివున్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన మూల్యం చెల్లించాలి. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది. ఆ ప్రత్యర్థుల విషయానికొస్తే, నేను కోరేదేమిటంటే వారు తమకు తాముగా విడిపోవాలి! నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు పరిచర్య చేసుకోండి. “నీలాగే నీ పొరుగువారిని ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకొని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్త పడండి లేదా ఒకరి ద్వారా ఒకరు నాశనం అవుతారు. కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు. శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కనుక మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు. మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నవారైతే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు.
గలతీయులకు 5:7-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది. మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు. సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా? మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది. సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి. ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది. అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి. నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు. ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
గలతీయులకు 5:7-18 పవిత్ర బైబిల్ (TERV)
మీరు పందెంలో బాగా పరుగెత్తుచుంటిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు? మిమ్మల్ని పిలిచినవాడు ఆటంక పరచలేదు. “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు. మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభువునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు, ఎవడైనా సరే వాడు తప్పక శిక్షననుభవిస్తాడు. నా సోదరులారా, సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లైతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. మిమ్మల్ని కలవర పెట్టేవాళ్ళు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది. నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి. “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది. మీరీ విధంగా కలహములాడుకొంటూ, హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి. కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నదాన్ని చెయ్యలేకపోతున్నారు. కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.
గలతీయులకు 5:7-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. ధర్మశాస్త్ర మంతయు– నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు కొనుడి. నేను చెప్పునదేమనగా ఆత్మా నుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మ కును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయ కుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు.
గలతీయులకు 5:7-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు బాగా పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు? అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు. “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” మీరు మరోలా ఆలోచించరని ప్రభువులో నేను నమ్మకం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన శిక్షను భరించాలి. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది కదా. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు తమను తాము నరికివేసుకోవడం మంచిది! నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి. “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకుని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్తపడండి లేదా ఒకరి వలన ఒకరు నాశనం అవుతారు జాగ్రత్తపడండి. కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు. శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు. మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నవారైతే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు.