ఎజ్రా 3:7-13
ఎజ్రా 3:7-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవనెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలురాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి–యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.
ఎజ్రా 3:7-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు తాపీ పనివారికి, వడ్రంగం పనివారికి డబ్బు ఇచ్చారు. ఇంకా పర్షియా దేశపు రాజు కోరెషు తమకు చెప్పిన విధంగా లెబానోను నుండి దేవదారు మానులను సముద్ర మార్గంలో యొప్పే పట్టణానికి తెప్పించడానికి సీదోను, తూరు వారికి భోజన పదార్థాలు, పానీయాలు, నూనె ఇచ్చారు. యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ, చెరలో నుండి విడుదలై యెరూషలేముకు వచ్చిన వారు, అందరూ కలిసి పని ప్రారంభించారు. ఇరవై సంవత్సరాలు నిండిన లేవీయులు యెహోవా మందిరం కట్టే పనికి నియమితులయ్యారు. యేషూవ కొడుకులు, సహోదరులు, కద్మీయేలు, అతని కొడుకులు, యుదా కొడుకులు, హేనాదాదు కొడుకులు, అతని మనుమలు, లేవీయులైన వారి బంధువులు దేవుని మందిరంలో పని చేసేవారిపై పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు. గతంలో ఉన్న మందిరాన్ని చూసిన యాజకుల్లో, లేవీయుల కుటుంబ పెద్దల్లో ముసలివారు చాలామంది ఇప్పుడు వేస్తున్న మందిరం పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. కొంతమంది సంతోషంతో గట్టిగా కేకలు వేశారు. ఏవి ఏడుపులో, ఏవి హర్ష ధ్వానాలో ప్రజలు తెలుసుకోలేక పోయారు. ప్రజలు వేసిన కేకల శబ్దం చాలా దూరం వినబడింది.
ఎజ్రా 3:7-13 పవిత్ర బైబిల్ (TERV)
చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్ల కలపను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా ఈ దేవదారు చెట్ల కలపను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక రాజు కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు. యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు. దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరియు అతని కొడుకులు, లేవీయులందరు. పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందుకోసం తమ తమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది. వాళ్లు కృతజ్ఞతాస్తుతులు పాడారు. “యెహోవా మంచివాడు. ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది” అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు. అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు. ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.
ఎజ్రా 3:7-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు వారు తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు డబ్బులు ఇచ్చారు. పర్షియా రాజైన కోరెషు ఆదేశం ప్రకారం దేవదారు మ్రానులను సముద్రం ద్వారా లెబానోను నుండి యొప్ప పట్టణానికి చేర్చడానికి సీదోనీయులకు, తూరువారికి భోజనపదార్థాలు, ఒలీవనూనె ఇచ్చారు. యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు. వీరితో పాటు యెషూవ అతని కుమారులు, అతని సోదరులు, కద్మీయేలు అతని కుమారులు (యూదా వారసులు), హేనాదాదు కుమారులు, వారి సోదరులైన లేవీయులందరు దేవుని మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించబడ్డారు. నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు. అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు. అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది.