ఎజ్రా 3

3
బలిపీఠ పునర్నిర్మాణం
1అలా ఏడవ నెల#3:1 ఏడవ నెల క్రీ. పూ. 538 సెప్టెంబరు-అక్టోబరు. నాటికి ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక ప్రజగా సమైక్యమయ్యారు. 2యెజాదా కొడుకైన యేషూవ, అతనితో వున్న యాజకులూ, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా ఆ బలిపీఠాన్ని నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొనబడినట్లు వాళ్లు ఆ బలిపీఠాన్ని నిర్మించారు. మోషే యెహోవాకు ప్రత్యేక సేవకుడు.
3తమకు సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాత పునాది మీదనే బలీపీఠాన్ని నిర్మించి, ఉదయంపూట, సాయంత్రంపూటాదహనబలులు సమర్పిస్తూ వచ్చారు. 4సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు వాళ్లు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. ఆ పండుగ రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో దహన బలులు సమర్పించారు. 5అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభించారు. 6ఈ విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆ ఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది.
దేవాలయ పునర్నిర్మాణం
7చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్ల కలపను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా ఈ దేవదారు చెట్ల కలపను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక రాజు కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు.
8యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో#3:8 రెండవ నెలలో క్రీ.పూ. 536 ఏప్రిల్‌-మే. షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు. 9దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరియు అతని కొడుకులు, లేవీయులందరు. 10పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందుకోసం తమ తమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది. 11వాళ్లు కృతజ్ఞతాస్తుతులు#3:11 కృతజ్ఞతాస్తుతులు ఈ కీర్తనల్లో ఒక పదాన్ని ఒక బృందం (లేవీయులు) పాడితే, మరో బృందం (జనం) ప్రతిస్పందించి మరో పదం పాడుతారు. ఇవి బహుశా ఈ కీర్తనలు అయ్యుంటాయి. కీర్తన. 111–118; 136. పాడారు.
“యెహోవా మంచివాడు.
ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది”
అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు.
12అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు. 13ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎజ్రా 3: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి