ఎజ్రా 3:10-13

ఎజ్రా 3:10-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు. వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు. గతంలో ఉన్న మందిరాన్ని చూసిన యాజకుల్లో, లేవీయుల కుటుంబ పెద్దల్లో ముసలివారు చాలామంది ఇప్పుడు వేస్తున్న మందిరం పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. కొంతమంది సంతోషంతో గట్టిగా కేకలు వేశారు. ఏవి ఏడుపులో, ఏవి హర్ష ధ్వానాలో ప్రజలు తెలుసుకోలేక పోయారు. ప్రజలు వేసిన కేకల శబ్దం చాలా దూరం వినబడింది.

షేర్ చేయి
Read ఎజ్రా 3

ఎజ్రా 3:10-13 పవిత్ర బైబిల్ (TERV)

పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందుకోసం తమ తమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది. వాళ్లు కృతజ్ఞతాస్తుతులు పాడారు. “యెహోవా మంచివాడు. ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది” అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు. అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు. ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.

షేర్ చేయి
Read ఎజ్రా 3

ఎజ్రా 3:10-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలురాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి–యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.

షేర్ చేయి
Read ఎజ్రా 3

ఎజ్రా 3:10-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు. అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు. అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది.

షేర్ చేయి
Read ఎజ్రా 3