యెహెజ్కేలు 8:11-16
యెహెజ్కేలు 8:11-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది. ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు. ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు. ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు. అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నీవు ఇది చూస్తున్నావా? అని యెహోవా అన్నాడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు. ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు.
యెహెజ్కేలు 8:11-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలైన డెబ్భై మంది అక్కడ ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కొడుకు యజన్యా ఉన్నాడు. వాళ్ళంతా ఆ బొమ్మలకి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రతివాడి చేతిలో ధూపం వేసే పాత్ర ఒకటి ఉంది. వాళ్ళంతా ధూపం వేయడం వల్ల అది ఒక మేఘంలా పైకి వెళ్తూ ఉంది. దాని పరిమళం అంతటా నిండి ఉంది. అప్పుడాయన నాకిలా చెప్పాడు. “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు చీకట్లో ఏం చేస్తున్నారో చూశావా? ప్రతి ఒక్కడూ తన తన రహస్య గదుల్లో తన విగ్రహాలకు ఇలాగే చేస్తున్నాడు. ‘యెహోవా మమ్మల్ని చూడ్డం లేదు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు’ అని చెప్పుకుంటున్నారు.” తరువాత ఆయన “నువ్వు ఈ వైపుకి తిరిగి చూడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీళ్ళు చేయడం చూస్తావు” అన్నాడు. ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరానికి ఉత్తరం వైపున ఉన్న ద్వారం దగ్గర నన్ను దించాడు. అక్కడ చూడండి! స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవుడి కోసం ఏడుస్తున్నారు. అప్పుడాయన “నరపుత్రుడా, ఇది చూశావా? ఇప్పుడు ఇంతకంటే అసహ్యమైనది చూస్తావు” అని నాకు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.
యెహెజ్కేలు 8:11-16 పవిత్ర బైబిల్ (TERV)
అక్కడ షాఫాము కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది. అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తున్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! ‘మనల్ని యెహోవా చూడలేడు. యెహోవా ఈ దేశాన్ని వదిలేశాడు’ అని వారిలో వారనుకుంటున్నారు.” దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, ఆ మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు. దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. ఈ ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూటకపు దైవము తమ్మూజును గురించి దుఃఖిస్తున్నారు! దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ భయంకరమైన విషయాలు గమనించావా? నా వెంట రమ్ము. నీవింతకంటే ఘోరమైన విషయాలు చూస్తావు!” ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది క్రిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!
యెహెజ్కేలు 8:11-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆయాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగా – నరపుత్రుడా – యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన–నీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములువారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని. అప్పుడాయన–నరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచినయెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకునుమధ్యను ఇంచుమించు ఇరువదియయిదుగురు మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయముతట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి.