నిర్గమకాండము 7:1-13

నిర్గమకాండము 7:1-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “చూడు, నేను నిన్ను ఫరోకు దేవునిలా చేస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ నీవు చెప్పాలి, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వాలని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పాలి. కాని నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, కాబట్టి ఈజిప్టు దేశంలో నా సూచనలను, అద్భుతాలను అధికంగా చేసినప్పటికీ, ఫరో మీ మాట వినడు. అప్పుడు నేను ఈజిప్టుపై నా చేతిని ఉంచి గొప్ప తీర్పు చర్యలతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం బయటకు తీసుకువస్తాను. నేను ఈజిప్టుకు వ్యతిరేకంగా చేయి చాచి ఇశ్రాయేలీయులను దాని నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను యెహోవానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.” మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు అహరోనుకు 83 సంవత్సరాలు. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “ ‘ఒక అద్భుతకార్యం చేయండి’ అని ఫరో మీతో చెప్పినప్పుడు, నీవు అహరోనుతో, ‘నీ చేతికర్రను తీసుకుని ఫరో ఎదుట పడవేయి’ అని చెప్పు. అది పాముగా మారుతుంది.” మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది పాముగా మారింది. ఫరో జ్ఞానులను మంత్రగాళ్ళను పిలిపించాడు. ఈజిప్టువారి మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అలాగే చేశారు. ప్రతి ఒక్కరు తమ కర్రను క్రింద పడవేయగా అది పాముగా మారింది. అయితే అహరోను కర్ర వారి కర్రలను మ్రింగివేసింది. కాని యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటను వినలేదు.

నిర్గమకాండము 7:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను. అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు. యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.” మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది. అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.

నిర్గమకాండము 7:1-13 పవిత్ర బైబిల్ (TERV)

మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహారాజులా ఉంటావు. అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా ఉంటాడు. నీకు నేను ఆజ్ఞాపించేదంతా అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెబుతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు. అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు. అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశంనుండి బయటకు నడిపిస్తాను.” మోషే, అహరోనులు యెహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు. అప్పటికి మోషే వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు 83 సంవత్సరాలు. మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు: “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు. అతని కర్ర నేలమీద పడవేయమని అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పావు అవుతుంది.” కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది. కనుక రాజు తన విద్వాంసులను, మంత్రగాళ్లను పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసినట్లే చేయగల్గారు. వాళ్లు కూడా వారి కర్రలను నేల మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది. అయినా సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది. మోషే, అహరోనుల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు.

నిర్గమకాండము 7:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును; అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తుమీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తుమీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి. వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మ్రింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.

నిర్గమకాండము 7:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)