నిర్గమకాండము 7

7
1కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. 2నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును; 3అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. 4ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తుమీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను. 5నేను ఐగుప్తుమీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను. 6మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి. 7వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.
8-9మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును. 10కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను. 11అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి. 12వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మ్రింగివేయగా 13యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. 14తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను 15ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని 16అతని చూచి–అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయులదేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు–ఇదివరకు వినకపోతివి. 17కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును. 18ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పు మనెను. 19మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనుతో–నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువులమీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. 20యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను. 21ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను. 22ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అట్లుచేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. 23జరిగినదానిని మన స్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను. 24అయితే ఐగుప్తీయులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 7: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for నిర్గమకాండము 7