నిర్గమకాండము 4:1-17
నిర్గమకాండము 4:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అందుకు మోషే–చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు–యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా యెహోవా–నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు–కఱ్ఱ అనెను. అప్పుడాయన–నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా–నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతనిచేతిలో కఱ్ఱ ఆయెను. ఆయన –దానిచేత వారు తమపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. మరియు యెహోవా–నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన–నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయన–వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను. అప్పుడు మోషే–ప్రభువా, ఇంతకుమునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా–మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. అందుకతడు–అయ్యో ప్రభువా, నీవు పంప తలంచినవానినే పంపుమనగా ఆయన మోషేమీద కోపపడి–లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును; నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కఱ్ఱను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను.
నిర్గమకాండము 4:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు మోషే “వాళ్ళు నన్ను నమ్మరు. నా మాట వినరు. ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అంటారేమో” అని జవాబిచ్చాడు. యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు. అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు. తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది. తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది. అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు. మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు. అప్పుడు యెహోవా “మనుషులకు నోరు ఇచ్చిన వాడు ఎవరు? మూగ వారిని, చెవిటి వారిని, చూపు గలవారిని, గుడ్డి వారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లు, నేను నీ నోటికి తోడుగా ఉండి, నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను” అని మోషేతో చెప్పాడు. మోషే “ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు” అన్నాడు. అందుకు యెహోవా మోషే మీద కోపపడి “లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు గదా? అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు. నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికీ, అతని నోటికీ తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను. అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క. ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి” అని చెప్పాడు.
నిర్గమకాండము 4:1-17 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’” అన్నాడు దేవునితో. అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు. “ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు. అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో” అన్నాడు. మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది. “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు. ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో. కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి. “నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది. “నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు. నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు. అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాటకారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగం రాదనీ నీకు తెలుసు” అన్నాడు. “మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు? వీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను, అందుచేత వెళ్లు. నీవు మాట్లాడేటప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు నేనే నీకు చెబుతాను” అని అతనితో యెహోవా అన్నాడు. కానీ మోషే, “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటున్నాను” అన్నాడు. యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకొంటాను. అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి సంతోషిస్తాడు, అతడు నీతోకూడ ఫరో దగ్గరకు వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబుతాను, అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు. ప్రజలతో కూడ అహరోనే నీ పక్షంగా మాట్లాడుతాడు. అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు. కనుక వెళ్లు. నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు.
నిర్గమకాండము 4:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు. అప్పుడు యెహోవా అతనితో, “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని అన్నారు. “ఒక కర్ర” అని అతడు జవాబిచ్చాడు. అందుకు యెహోవా, “దానిని నేలపై పడవేయి” అన్నారు. మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా, “నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు” అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది. అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు. యెహోవా, “నీ చేతిని నీ ఛాతీ మీద పెట్టు” అన్నారు. మోషే తన చేతిని తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీయగా, అది కుష్ఠురోగంతో మంచులా తెల్లగా మారిపోయింది. “ఇప్పుడు నీ చేయి మరలా నీ ఛాతీ మీద పెట్టు” అని ఆయన అన్నారు. మోషే తన చేతిని మరలా తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీసినప్పుడు, అది తిరిగి మంచిదిగా, మిగితా దేహంలా అది మారింది. అప్పుడు యెహోవా, “వారు నిన్ను నమ్మకపోయినా మొదటి అసాధారణ గుర్తును లక్ష్యపెట్టకపోయినా, రెండవదానిని బట్టి నమ్మవచ్చు. అయితే వారు ఈ రెండు అసాధారణ గుర్తులను కూడా నమ్మకపోయినా లేదా నీ మాట వినకపోయినా, నీవు నైలు నది నుండి కొంచెం నీరు తీసుకుని పొడినేల మీద పోయి. నీవు నది నుండి తీసుకున్న నీరు నేలమీద రక్తంగా మారుతుంది” అని చెప్పారు. అప్పుడు మోషే యెహోవాతో, “ప్రభువా, నీ సేవకుని క్షమించు. గతంలో కాని నీవు నీ సేవకునితో మాట్లాడినప్పటినుండి కాని నేను ఎప్పుడూ మాటకారిని కాదు. నేను నత్తివాన్ని నా నాలుక సరిగా తిరగదు” అన్నాడు. యెహోవా అతనితో అన్నారు, “మానవులకు నోరు ఇచ్చింది ఎవరు? వారిని చెవిటివారిగా మూగవారిగా చేసింది ఎవరు? వారికి చూపును ఇచ్చింది, గ్రుడ్డివారిగా చేసింది ఎవరు? యెహోవానైన, నేను కాదా? కాబట్టి వెళ్లు; నేను సహాయం చేస్తాను, ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను.” కాని మోషే, “ప్రభువా, నీ సేవకుని క్షమించండి. దయచేసి మరొకరిని పంపించండి” అన్నాడు. అప్పుడు యెహోవా కోపం మోషేపై కోపం రగులుకుంది, ఆయన అన్నారు, “లేవీయుడైన నీ అన్న అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. అతడు నిన్ను కలుసుకోడానికి వస్తున్నాడు. నిన్ను చూసి అతడు సంతోషిస్తాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను. మీరు మాట్లాడడానికి సహాయం చేస్తాను, అలాగే మీరేమి చేయాలో నేను మీకు బోధిస్తాను. అతడే నీ బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతడు నీకోసం మాట్లాడే వాడిగా ఉంటాడు, నీవు అతనికి దేవునిలా ఉంటావు. ఈ కర్రను నీ చేతితో పట్టుకో, దీనితో నీవు అసాధారణ గుర్తులు చేయగలవు” అన్నారు.