అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు.
అప్పుడు యెహోవా అతనితో, “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని అన్నారు.
“ఒక కర్ర” అని అతడు జవాబిచ్చాడు.
అందుకు యెహోవా, “దానిని నేలపై పడవేయి” అన్నారు.
మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా, “నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు” అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది. అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు.
యెహోవా, “నీ చేతిని నీ ఛాతీ మీద పెట్టు” అన్నారు. మోషే తన చేతిని తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీయగా, అది కుష్ఠురోగంతో మంచులా తెల్లగా మారిపోయింది.
“ఇప్పుడు నీ చేయి మరలా నీ ఛాతీ మీద పెట్టు” అని ఆయన అన్నారు. మోషే తన చేతిని మరలా తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీసినప్పుడు, అది తిరిగి మంచిదిగా, మిగితా దేహంలా అది మారింది.
అప్పుడు యెహోవా, “వారు నిన్ను నమ్మకపోయినా మొదటి అసాధారణ గుర్తును లక్ష్యపెట్టకపోయినా, రెండవదానిని బట్టి నమ్మవచ్చు. అయితే వారు ఈ రెండు అసాధారణ గుర్తులను కూడా నమ్మకపోయినా లేదా నీ మాట వినకపోయినా, నీవు నైలు నది నుండి కొంచెం నీరు తీసుకుని పొడినేల మీద పోయి. నీవు నది నుండి తీసుకున్న నీరు నేలమీద రక్తంగా మారుతుంది” అని చెప్పారు.
అప్పుడు మోషే యెహోవాతో, “ప్రభువా, నీ సేవకుని క్షమించు. గతంలో కాని నీవు నీ సేవకునితో మాట్లాడినప్పటినుండి కాని నేను ఎప్పుడూ మాటకారిని కాదు. నేను నత్తివాన్ని నా నాలుక సరిగా తిరగదు” అన్నాడు.
యెహోవా అతనితో అన్నారు, “మానవులకు నోరు ఇచ్చింది ఎవరు? వారిని చెవిటివారిగా మూగవారిగా చేసింది ఎవరు? వారికి చూపును ఇచ్చింది, గ్రుడ్డివారిగా చేసింది ఎవరు? యెహోవానైన, నేను కాదా? కాబట్టి వెళ్లు; నేను సహాయం చేస్తాను, ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను.”
కాని మోషే, “ప్రభువా, నీ సేవకుని క్షమించండి. దయచేసి మరొకరిని పంపించండి” అన్నాడు.
అప్పుడు యెహోవా కోపం మోషేపై కోపం రగులుకుంది, ఆయన అన్నారు, “లేవీయుడైన నీ అన్న అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. అతడు నిన్ను కలుసుకోడానికి వస్తున్నాడు. నిన్ను చూసి అతడు సంతోషిస్తాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను. మీరు మాట్లాడడానికి సహాయం చేస్తాను, అలాగే మీరేమి చేయాలో నేను మీకు బోధిస్తాను. అతడే నీ బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతడు నీకోసం మాట్లాడే వాడిగా ఉంటాడు, నీవు అతనికి దేవునిలా ఉంటావు. ఈ కర్రను నీ చేతితో పట్టుకో, దీనితో నీవు అసాధారణ గుర్తులు చేయగలవు” అన్నారు.