నిర్గమకాండము 23:10-12
నిర్గమకాండము 23:10-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి. ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి. ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసీ కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి.
నిర్గమకాండము 23:10-12 పవిత్ర బైబిల్ (TERV)
“విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి. అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి. “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.
నిర్గమకాండము 23:10-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆరుసంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను. ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవదినమున ఊరక యుండవలెను.
నిర్గమకాండము 23:10-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఆరు సంవత్సరాలు మీరు పొలంలో విత్తనాలు విత్తి పంట కోయాలి, ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి. “ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.