నిర్గమకాండము 20:1-17
నిర్గమకాండము 20:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. –నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
నిర్గమకాండము 20:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు, నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే. నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు. ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి. ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు. ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు. నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి. హత్య చెయ్యకూడదు. వ్యభిచారం చెయ్యకూడదు. దొంగతనం చెయ్యకూడదు. నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
నిర్గమకాండము 20:1-17 పవిత్ర బైబిల్ (TERV)
అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు: “నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి) “నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు. “విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను. ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను. అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను. “మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు. “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు. “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి. “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు. “వ్యభిచార పాపం నీవు చేయకూడదు. “నీవు దొంగతనం చేయకూడదు. “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు. “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
నిర్గమకాండము 20:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తర్వాత దేవుడు ఈ మాటలన్నీ మాట్లాడారు: “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. “నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు. మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను. మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు. సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు. ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి, ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి యెహోవా సబ్బాతు దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధం చేశారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి. మీరు హత్య చేయకూడదు. మీరు వ్యభిచారం చేయకూడదు. మీరు దొంగతనం చేయకూడదు. మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”