నిర్గమకాండము 20
20
పది ఆజ్ఞలు
1అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
2“నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)
3“నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.
4“విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. 5ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను.#20:5 ద్వేషిస్తాను నేనే ఎల్కానా, రోషంగల దేవుణ్ణి. ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను. 6అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.
7“మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.
8“సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. 9వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. 10అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. 11ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.
12“నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.
13“నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.
14“వ్యభిచార పాపం నీవు చేయకూడదు.
15“నీవు దొంగతనం చేయకూడదు.
16“నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.
17“ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
ప్రజలకు దేవుడంటే భయం
18ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు చూస్తునే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు.
19అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడాలంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో మాట్లాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని చెప్పారు.
20అప్పుడు మోషే, “తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవించాలని ఆయన కోరుతున్నాడు” అని ప్రజలకు చెప్పాడు.
21దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు. 22అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. “ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు చూసారు. 23కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.
24“నా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు యిలా చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 25మీరు బండలతో#20:25 బండలతో బహుశ ఇనుప పనిముట్టు కావచ్చు. యుద్దంలో యినుప పనిముట్లు వాడేవారు గనుక బలిపీఠం కట్టుట్ధకు అవి వాడకూడదు. బలిపీఠం కడితే, చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని ముట్లు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీకరించను. 26బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్లు చేయకూడదు. అలా మెట్లు ఉంటే, ప్రజలు బలిపీఠం వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి కనబడుతుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమకాండము 20: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International