నిర్గమకాండము 16:6-36
నిర్గమకాండము 16:6-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో–యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. మరియు మోషే –మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహో వాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను అంతట మోషే అహరోనుతో–యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను– నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని నీవు–సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెముచుట్టు పడియుండెను. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను. ఇశ్రాయేలీయులు అట్లుచేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమతమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. మరియు మోషే–దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయమువరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపెట్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ఆరవదినమునవారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించి నట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు. ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవదినమున అది దొరకదనెను. అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవదినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవదినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవదినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను. కాబట్టి యేడవదినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను. మరియు మోషే ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా–నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి. ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
నిర్గమకాండము 16:6-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. “మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు. ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.” మోషే వాళ్ళతో “మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?” అన్నాడు. మోషే అహరోనులతో యెహోవా “ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.” అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను. వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.” అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.” ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు. అప్పుడు మోషే “ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు” అని వాళ్ళతో చెప్పాడు. అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది. ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు. అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.” మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు. అప్పడు మోషే “ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు. మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు” అని చెప్పాడు. ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు గానీ వాళ్లకు ఏమీ దొరకలేదు. అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు “మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు? వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.” అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది. మోషే ఇలా చెప్పాడు “యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి.” అప్పుడు మోషే అహరోనుతో “నువ్వు ఒక గిన్నె తీసుకుని, దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి, మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు” అని చెప్పాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు. తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకూ నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు. ఓమెరు అంటే ఏఫాలో పదవ వంతు.
నిర్గమకాండము 16:6-36 పవిత్ర బైబిల్ (TERV)
కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు. యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?” “మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే. ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.” అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’” ఆ రాత్రి వారి బస అంతటా పూరేళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది. సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.” కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు. ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు. “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు. కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది. ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది. శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు. “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో. కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు. శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.” శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు. అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు? చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.” కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు. ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా” అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది. అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని యెహోవా చెప్పాడు.” కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు” మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె ముందర పెట్టాడు అహరోను. 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం.)
నిర్గమకాండము 16:6-36 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, “మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించింది యెహోవాయే అని సాయంకాలాన మీరు తెలుసుకుంటారు. ఉదయకాలం మీరు యెహోవా మహిమను చూస్తారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మీరు మామీద సణగడానికి మేము ఏపాటివారం?” అన్నారు. ఇంకా మోషే మాట్లాడుతూ, “మీరు తినడానికి సాయంకాలం మాంసాన్ని, ఉదయకాలం మీకు సరిపడే ఆహారాన్ని యెహోవా మీకు ఇచ్చినప్పుడు, ఆయన యెహోవా అని మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మేము ఏపాటివారం? మీరు మామీద సణగడం లేదు, కాని యెహోవా మీదనే సణుగుతున్నారు” అన్నాడు. తర్వాత మోషే అహరోనుతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల సమాజమంతటికి ఇలా చెప్పు, ‘యెహోవా మీ సణుగుడు విన్నారు కాబట్టి ఆయన ఎదుటకు రండి.’ ” అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతున్నప్పుడు వారు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ వారికి యెహోవా మహిమ మేఘంలో కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ” ఆ సాయంకాలం పూరేళ్ళు వచ్చి శిబిరం స్థలాన్ని కప్పివేశాయి, ఉదయకాలం ఆ శిబిరం చుట్టూ మంచు పొర ఉంది. ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత పోగుచేసుకోవాలి. మీ గుడారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు చొప్పున పోగుచేసుకోవాలి.’ ” ఇశ్రాయేలీయులు తమకు చెప్పబడినట్లుగానే చేశారు; కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు. వారు దానిని ఓమెరుతో కొలిచినప్పుడు ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు. ప్రతిఒక్కరు తమకు ఎంత అవసరమో అంతే పోగుచేసుకున్నారు. అప్పుడు మోషే వారితో, “దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకోకూడదు” అని చెప్పాడు. అయితే వారిలో కొందరు మోషే మాట వినిపించుకోకుండా దానిలో కొంచెం ఉదయం వరకు మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టింది. కాబట్టి మోషే వారిమీద కోపడ్డాడు. ప్రతి ఉదయం ప్రతి ఒక్కరు తమకు కావలసినంత పోగుచేసుకునేవారు, ఎండ తీవ్రత పెరిగినప్పుడు అది కరిగిపోయేది. ఆరవరోజు, ఒక్కొక్కరికి రెండేసి ఓమెర్ల చొప్పున రెట్టింపు పోగుచేసుకున్నారు, సమాజ నాయకులు వచ్చి మోషేకు దానిని తెలిపారు. అతడు వారితో, “యెహోవా ఆజ్ఞ ఇదే, రేపు సబ్బాతు దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన సబ్బాతు విశ్రాంతి దినము. కాబట్టి మీరు కాల్చుకోవాలనుకున్నది కాల్చుకోండి, వండుకోవాలనుకున్నది వండుకోండి. మిగిలింది ఉదయం వరకు ఉంచుకోండి” అని చెప్పాడు. మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఉదయం వరకు దానిని ఉంచారు కాని అది కంపుకొట్టలేదు పురుగులు పట్టలేదు. అప్పుడు మోషే, “ఈ రోజు దానిని తినండి. ఈ రోజు యెహోవాకు సబ్బాతు దినము. ఈ రోజు నేల మీద ఏమి దొరకదు. ఆరు రోజులు మీరు దానిని పోగుచేసుకోవాలి కాని ఏడవ రోజున, అనగా సబ్బాతు దినాన్న అది దొరకదు” అని చెప్పాడు. అయితే కొందరు ఏడవ రోజున దానిని పోగుచేసుకుందామని బయటకు వెళ్లారు కాని వారికేమి దొరకలేదు. కాబట్టి యెహోవా మోషేతో, “ఎంతకాలం మీరు నా ఆజ్ఞలను సూచనలను పాటించకుండా ఉంటారు? యెహోవా ఈ సబ్బాతును మీకు ఇచ్చారని మనస్సులో గుర్తించుకోండి; అందుకే ఆరవరోజు ఆయన మీకు రెండు రోజులకు సరిపడా ఆహారమిస్తున్నారు. ఏడవ రోజున ప్రతిఒక్కరు తామున్న చోటనే ఉండాలి. ఏడవ రోజున ఎవరు తామున్న చోటినుండి బయటకు వెళ్లకూడదు” అన్నారు. కాబట్టి ప్రజలు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా కొత్తిమెర గింజల్లా ఉండి దాని రుచి తేనెతో చేసిన పల్చనిరొట్టెల వలె ఉంది. మోషే వారితో, “యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి రప్పించినప్పుడు అరణ్యంలో తినడానికి నేను మీకిచ్చిన ఆహారాన్ని రాబోయే తరాలవారు చూసేలా ఒక ఓమెరు మన్నాను తీసుకుని తమ దగ్గర ఉంచాలి.’ ” కాబట్టి మోషే అహరోనుతో, “ఒక జాడీ తీసుకుని అందులో ఒక ఓమెరు మన్నాను నింపి, రాబోయే తరాలవారు తమ దగ్గర ఉంచుకునేలా దానిని యెహోవా ఎదుట ఉంచాలి” అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను మన్నాను నిబంధన పలకలను మందసం దగ్గర ఉంచాడు. ఇశ్రాయేలీయులు తాము నివసించవలసిన దేశానికి వచ్చేవరకు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు; వారు కనాను సరిహద్దులు చేరేవరకు మన్నాను తిన్నారు. (ఓమెరు అనగా ఏఫాలో పదవ వంతు.)