కాబట్టి మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, “మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించింది యెహోవాయే అని సాయంకాలాన మీరు తెలుసుకుంటారు. ఉదయకాలం మీరు యెహోవా మహిమను చూస్తారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మీరు మామీద సణగడానికి మేము ఏపాటివారం?” అన్నారు. ఇంకా మోషే మాట్లాడుతూ, “మీరు తినడానికి సాయంకాలం మాంసాన్ని, ఉదయకాలం మీకు సరిపడే ఆహారాన్ని యెహోవా మీకు ఇచ్చినప్పుడు, ఆయన యెహోవా అని మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మేము ఏపాటివారం? మీరు మామీద సణగడం లేదు, కాని యెహోవా మీదనే సణుగుతున్నారు” అన్నాడు.
తర్వాత మోషే అహరోనుతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల సమాజమంతటికి ఇలా చెప్పు, ‘యెహోవా మీ సణుగుడు విన్నారు కాబట్టి ఆయన ఎదుటకు రండి.’ ”
అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతున్నప్పుడు వారు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ వారికి యెహోవా మహిమ మేఘంలో కనిపించింది.
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ”
ఆ సాయంకాలం పూరేళ్ళు వచ్చి శిబిరం స్థలాన్ని కప్పివేశాయి, ఉదయకాలం ఆ శిబిరం చుట్టూ మంచు పొర ఉంది. ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము. యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత పోగుచేసుకోవాలి. మీ గుడారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు చొప్పున పోగుచేసుకోవాలి.’ ”
ఇశ్రాయేలీయులు తమకు చెప్పబడినట్లుగానే చేశారు; కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు. వారు దానిని ఓమెరుతో కొలిచినప్పుడు ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు. ప్రతిఒక్కరు తమకు ఎంత అవసరమో అంతే పోగుచేసుకున్నారు.
అప్పుడు మోషే వారితో, “దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకోకూడదు” అని చెప్పాడు.
అయితే వారిలో కొందరు మోషే మాట వినిపించుకోకుండా దానిలో కొంచెం ఉదయం వరకు మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టింది. కాబట్టి మోషే వారిమీద కోపడ్డాడు.
ప్రతి ఉదయం ప్రతి ఒక్కరు తమకు కావలసినంత పోగుచేసుకునేవారు, ఎండ తీవ్రత పెరిగినప్పుడు అది కరిగిపోయేది. ఆరవరోజు, ఒక్కొక్కరికి రెండేసి ఓమెర్ల చొప్పున రెట్టింపు పోగుచేసుకున్నారు, సమాజ నాయకులు వచ్చి మోషేకు దానిని తెలిపారు. అతడు వారితో, “యెహోవా ఆజ్ఞ ఇదే, రేపు సబ్బాతు దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన సబ్బాతు విశ్రాంతి దినము. కాబట్టి మీరు కాల్చుకోవాలనుకున్నది కాల్చుకోండి, వండుకోవాలనుకున్నది వండుకోండి. మిగిలింది ఉదయం వరకు ఉంచుకోండి” అని చెప్పాడు.
మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఉదయం వరకు దానిని ఉంచారు కాని అది కంపుకొట్టలేదు పురుగులు పట్టలేదు. అప్పుడు మోషే, “ఈ రోజు దానిని తినండి. ఈ రోజు యెహోవాకు సబ్బాతు దినము. ఈ రోజు నేల మీద ఏమి దొరకదు. ఆరు రోజులు మీరు దానిని పోగుచేసుకోవాలి కాని ఏడవ రోజున, అనగా సబ్బాతు దినాన్న అది దొరకదు” అని చెప్పాడు.
అయితే కొందరు ఏడవ రోజున దానిని పోగుచేసుకుందామని బయటకు వెళ్లారు కాని వారికేమి దొరకలేదు. కాబట్టి యెహోవా మోషేతో, “ఎంతకాలం మీరు నా ఆజ్ఞలను సూచనలను పాటించకుండా ఉంటారు? యెహోవా ఈ సబ్బాతును మీకు ఇచ్చారని మనస్సులో గుర్తించుకోండి; అందుకే ఆరవరోజు ఆయన మీకు రెండు రోజులకు సరిపడా ఆహారమిస్తున్నారు. ఏడవ రోజున ప్రతిఒక్కరు తామున్న చోటనే ఉండాలి. ఏడవ రోజున ఎవరు తామున్న చోటినుండి బయటకు వెళ్లకూడదు” అన్నారు. కాబట్టి ప్రజలు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు.
ఇశ్రాయేలీయులు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా కొత్తిమెర గింజల్లా ఉండి దాని రుచి తేనెతో చేసిన పల్చనిరొట్టెల వలె ఉంది. మోషే వారితో, “యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి రప్పించినప్పుడు అరణ్యంలో తినడానికి నేను మీకిచ్చిన ఆహారాన్ని రాబోయే తరాలవారు చూసేలా ఒక ఓమెరు మన్నాను తీసుకుని తమ దగ్గర ఉంచాలి.’ ”
కాబట్టి మోషే అహరోనుతో, “ఒక జాడీ తీసుకుని అందులో ఒక ఓమెరు మన్నాను నింపి, రాబోయే తరాలవారు తమ దగ్గర ఉంచుకునేలా దానిని యెహోవా ఎదుట ఉంచాలి” అని చెప్పాడు.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను మన్నాను నిబంధన పలకలను మందసం దగ్గర ఉంచాడు. ఇశ్రాయేలీయులు తాము నివసించవలసిన దేశానికి వచ్చేవరకు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు; వారు కనాను సరిహద్దులు చేరేవరకు మన్నాను తిన్నారు.
(ఓమెరు అనగా ఏఫాలో పదవ వంతు.)