ఎస్తేరు 1:1-12

ఎస్తేరు 1:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇండియా నుండి ఇతియోపియా వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి. ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు. తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు. అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలనూ, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలనూ చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వారి ఎదుట ప్రదర్శించాడు. ఆ రోజులు గడిచిన తరువాత రాజు ఏడు రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకుని కొద్ది వారి వరకూ అందరికీ. అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది. ఆ ఉద్యానవనం ఆవరణలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నార తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు, నేరేడు వర్ణాల తెరలు వేలాడుతున్నాయి. వేరు వేరు రంగుల పాల రాయి పరచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్పాలు ఉన్నాయి. అతిథులకు బంగారు పాత్రల్లో తాగేందుకు పోశారు. ప్రతి పాత్రా దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు. ఆ విందు పానం “ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు” అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు. వష్తి రాణి కూడా అహష్వేరోషు రాజ భవనంలో స్త్రీలకు విందు చేసింది. ఏడో రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ సమావేశమైన ప్రజానీకానికి, అధిపతులకు వష్తి రాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజ కిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి. వష్తి రాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలి పోయాడు.

షేర్ చేయి
Read ఎస్తేరు 1

ఎస్తేరు 1:1-12 పవిత్ర బైబిల్ (TERV)

అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘటన యిది. అహష్వేరోషు భారత దేశంనుంచి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు. అహష్వేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది. ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు. ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీయబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించబడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు మొదలైన రంగుల విలువైన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి. అతిథులకు ద్రాక్షాసారా బంగారు పాత్రల్లో అందించబడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని పోలినది మరొకటి లేదు! రాజు బాగా ఔదార్యవంతుడేమో, ద్రాక్షాసారాకి కొదువ లేకపోయింది. రాజు ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత పోశాడు. మహారాణి వష్తి కూడా స్త్రీలకు రాజభవనంలో విందుచేసింది. ఆ విందు ఏడవ రోజున రాజు అహష్వేరోషు ద్రాక్షాసారా ఎక్కువగా సేవించాడు. మంచి మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు మంది సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే నపుంసకులకు మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వష్తి మహా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప్రముఖులకూ ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని సంకల్పం. ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం వచ్చింది.

షేర్ చేయి
Read ఎస్తేరు 1

ఎస్తేరు 1:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము : హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువదియేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలోనుండి రాజ్యపరిపాలన చేయుచుండగా తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందుచేయించెను. పారసీక దేశముయొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను. ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందుచేయించెను. అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను. రాణియైన వష్తి కూడ రాజైన అహష్వే రోషు కోటలో స్త్రీలకు ఒక విందుచేయించెను. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారముచేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.

షేర్ చేయి
Read ఎస్తేరు 1

ఎస్తేరు 1:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇండియా నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలు ఇవి. ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు. అతని పరిపాలనలోని మూడవ సంవత్సరంలో తన సంస్థానాధిపతులకు, అధికారులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. పర్షియా, మెదీయ సేనాధిపతులు, రాకుమారులు, సంస్థానాధిపతులు విందుకు హాజరయ్యారు. నూట ఎనభై రోజులు పాటు అతడు తనకున్న విస్తారమైన రాజ్య ఐశ్వర్యం, వైభవం, ఘనత, తేజస్సు ప్రదర్శించాడు. ఈ రోజులు గడిచిన తర్వాత, ఏడు రోజులపాటు రాజభవన తోటలో రాజు విందు చేశాడు, షూషనులో ఉన్న అల్పుల నుండి ఘనుల వరకు, ప్రజలందరికి అతడు విందు చేశాడు. ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి. అతిథులకు బంగారు పాన పాత్రల్లో ద్రాక్షరసం వడ్డించారు, ఒక్కో పాత్ర ఒక్కో దానికి భిన్నమైనది, రాజు ధారాళ స్వభావం గలవాడు కాబట్టి ద్రాక్షరసం సమృద్ధిగా ఉంది. రాజు ఆజ్ఞను బట్టి ప్రతి అతిథి కూడా ఎలాంటి పరిమితి లేకుండా త్రాగవచ్చు ఎందుకంటే వారందరికి కోరినంతగా ద్రాక్షరసం అందించమని వడ్డించే వారిని రాజు ఆదేశించాడు. వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది. ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ నపుంసకులు రాజు ఆజ్ఞను రాణియైన వష్తికి తెలియజేసినప్పుడు, ఆమె రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కోపంతో మండిపడ్డాడు.

షేర్ చేయి
Read ఎస్తేరు 1