ఎస్తేరు 1

1
వష్తి రాణి రాజుకు అవిధేయురాలగుట
1అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘటన యిది. అహష్వేరోషు భారత దేశంనుంచి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 2అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు.
3అహష్వేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది. 4ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు. 5ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు. 6ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీయబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించబడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు మొదలైన రంగుల విలువైన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి. 7అతిథులకు ద్రాక్షాసారా బంగారు పాత్రల్లో అందించబడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని పోలినది మరొకటి లేదు! రాజు బాగా ఔదార్యవంతుడేమో, ద్రాక్షాసారాకి కొదువ లేకపోయింది. 8రాజు ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత పోశాడు.
9మహారాణి వష్తి కూడా స్త్రీలకు రాజభవనంలో విందుచేసింది.
10-11ఆ విందు ఏడవ రోజున రాజు అహష్వేరోషు ద్రాక్షాసారా ఎక్కువగా సేవించాడు. మంచి మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు మంది సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే నపుంసకులకు మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వష్తి మహా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప్రముఖులకూ ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని సంకల్పం.
12ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం వచ్చింది. 13-14న్యాయ చట్టం గురించీ, శిక్షలను గురించి నిపుణుల సలహాలు అడగటం మహారాజుకి పరిపాటి. అందుకని, న్యాయనిపుణులైన తన సలహాదారులతో మహారాజు సంప్రదించాడు. మహా రాజుకి సన్నిహితులైన ఆ సలహాదారుల పేర్లు: కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను. ఈ యేడుగురూ పారశీక, మాదీయ దేశాల ప్రముఖులు. మహారాజును దర్శించేందుకు ప్రత్యేకమైన అనుమతులు కలిగినవాళ్లు. సామ్రాజ్యంలో అత్యున్నతమైన అధికారులు. 15మహారాజు వాళ్లని ఇలా ప్రశ్నించాడు: “మహారాజు తన నపుంసకులద్వారా వష్తి మహారాణికి ఒక ఆజ్ఞ పంపాడు. కాని, ఆమె రాజాజ్ఞను మన్నించలేదు. న్యాయచట్టం ప్రకారం ఆమెపైన ఎలాంటి చర్య తీసుకోవాలి?”
16అప్పుడు మెమూకాను యితర అధికారులు వింటూండగా మహారాజుకి ఇలా సమాధానమిచ్చాడు: “మహారాణి వష్తి చేసినది నేరం. ఆమె మహారాజు అహష్వేరోషు పట్లనే కాక రాజ్యములోని ఆయన సంస్థా నములన్నిటిలోనుండు అధికారుల పట్ల, ప్రముఖుల పట్ల కూడా నేరం చేసింది. 17నేనీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహారాణి వష్తి చేసిన యీ ఆజ్ఞోల్లంఘనాన్ని గురించి మిగిలిన స్త్రీలందరూ వింటారు. అప్పుడింక యితర స్త్రీలు కూడా తమ భర్తల పట్ల విధేయత చూపడం మానేస్తారు. వాళ్లు తమ భర్తలతో ఇలా వాదిస్తారు: ‘అహష్వేరోషు మహారాజు వష్తి మహారాణిని రమ్మని ఆజ్ఞాపించాడు. కాని, ఆమె వచ్చేందుకు నిరాకరించింది కదా.’
18“పారశీక, మాదీయ నాయకుల భార్యలు ఈనాడు మహారాణి చేసినదాన్ని గురించి విన్నారు. ఆమె చేసిన పనిచేత వాళ్లు ప్రభావితులవుతారు. ఆ స్త్రీలు కూడా మహారాజుగారి ప్రముఖుల పట్ల అలాగే వ్యవహరిస్తారు. దానితో అవిధేయతా, కోపతాపాలూ రెచ్చిపోతాయి.
19“మహారాజు సమ్మతిస్తే, నాదొక సూచన, మహారాజా, మీరు ఒక శాసనం జారీచెయ్యాలి. దాన్ని పారశీక, మాదీయ రాజ్యాల న్యాయచట్టాల్లో నమోదు చేయించాలి. అప్పుడిక పారశీక, మాదియ న్యాయచట్టాలను మార్చడం సాధ్యంకాదు. వష్తి అహష్వేరోషు మహారాజు సమక్షంలోకి యిక ఎన్నడూ రాకూడదు. అంతేకాదు, మహారాజు ఆమె (రాణి) పట్టమహిషిత్వ స్థానాన్ని ఆమెకంటె మెరుగైన స్త్రీకి ఇవ్వాలి. 20మహారాజు ఆజ్ఞ ఆయన సువిశాల సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాటింపబడినాక, స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు. అప్పుడిక అల్పుల దగ్గర్నుంచి అధికులదాకా స్త్రీలందరూ తమతమ భర్తల్ని గౌరవిస్తారు.”
21మహారాజుకి, ఆయన ముఖ్యాధికారులకీ యీ సలహా నచ్చింది. దానితో అహష్వేరోషు మహారాజు మెమూకాను చేసిన యీ సూచనను శాసనం చేశాడు. 22అహష్వేరోషు తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, యీ తాఖీదును పంపాడు. ఆ తాఖీదుల మేరకు, ప్రతి పురుషుడూ తన కుటుంబానికి యజమానిగా ప్రకటింపబడ్డాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎస్తేరు 1: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఎస్తేరు 1 కోసం వీడియో